ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్
రాష్ట్రంలో పేదల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే వారి పిల్లల చదువులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని నగర మేయర్ బివై.రామయ్య తెలిపారు. సోమవారం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న 19వ వార్డు 4వ తరగతి ఉద్యోగుల కాలనీలోని అంబేద్కర్ నగర్ నగర పాలక ప్రాథమిక పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. మేయర్ రామయ్య హాజరై విద్యా కానుకతో పాటు ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చిన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తదితర స్టేషనరీని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేక, ప్రయివేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొన్న పేదలకు ఆరు పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నాంది పలికారని తెలిపారు. అలాగే చదువుకు దూరమైన పిల్లలను కూడా ప్రోత్సహించి వారికి చదువు దగ్గరయ్యేలా చేశారన్నారు. గత ప్రభుత్వం విద్యా రంగానికి రూ.3,115 కోట్లు మాత్రమే కేటాయించినట్లు చెప్పారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం రూ.60,329.42 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ స్థాయిలో ఖర్చు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఉంటే చెప్పాలని టిడిపి నేతలకు సవాల్ విసిరారు.
ప్రస్తుత, గత ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలు గుర్తించాలి
గత, ప్రస్తుత ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను ఉపాధ్యాయులు గమనించాలని కోరారు. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గత నాలుగేళ్లలో విద్యారంగంలో సమూల ప్రక్షాళన జరిగిందన్నారు. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని పేద విద్యార్థులను తీర్చిదిద్దాలని తెలిపారు.
ఉపయోగపడే వస్తువులతో కలవాలి
ఆర్థిక స్థోమత ఉన్న ప్రజలు ఎవరినైనా ప్రముఖులను కలిసేటప్పుడు బోకేలు, దండలు, శాలువాలతో కాకుండా ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు వంటి స్టేషనరీలతో కలవాలని కోరారు. తద్వారా పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తన పుట్టినరోజున వచ్చిన స్టేషనరీని ఇలా పేద విద్యార్థులకు ఉపయోగపడడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, ప్రధానోపాధ్యాయులు నిర్మల, నాయకులు కనికే శివరాం, సామన్న, వెంకటస్వామి, వెంకటరమణ, లక్ష్మిపతి, తిరుపాలు, శ్రీను, చిన్న, గోవర్ధన్, ప్రసాద్, సతీష్, సంతోష్, నీలమ్మ పాల్గొన్నారు.
19వ వార్డులో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తున్న మేయర్.










