రాజంపేట అర్బన్ : ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు సాగు చేసుకునేందకు ప్రభుత్వం మంజూరు చేసిన భూములపై పెద్దల కన్ను పడింది. 28 ఏళ్ల కిందట ప్రభుత్వం నుంచి పట్టాలు పొందినా ఇప్పటికీ వారికి కేటాయించిన భూముల్లో సాగు చేసుకునేందుకు అవకాశం లేకపోవడం, తమకు న్యాయం చేయాలని బాధితలు అధికారుల చుట్టూ తిరగడం ఒక ఎత్తయితే.. ఆ భూములను సైతం ఆక్రమించేందుకు కొందరు యత్నించడం మరో ఎత్తు. దీంతో బాధితులు తమకు కేటాయించిన భూముల్లోనే నిరసన తెలియజేసి న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. వివరాలు...
మండల పరిధిలోని ఊటుకూరు, కొండ్లోపల్లి సమీపంలో 1995లో 1362 సర్వే నెంబర్‌లో ఒక్కొక్కరికి 60 సెంట్లు చొప్పున 67 మందికి ప్రభుత్వం పట్టాలు అందజేసింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ భూములు తనవేనంటూ కోర్టుకు వెళ్లాడు. హై కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చి యథావిధిగా ఆ భూమిని కొనసాగించుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు లబ్ధిదారులకు ఆదేశాలు జారీ చేసింది. తమకు కేటాయించిన భూములలో సాగు కోసం పనులు ప్రారం భించిన ప్రతిసారి ఎవరొకరు వచ్చి అడ్డుపడుతున్నారని బాధితులు వాపో తున్నారు. ప్రభుత్వం తమకు మంజూరు చేసిన భూములలో సాగు చేసుకునేందుకు అనుమతి నివ్వాలంటూ పలుమార్లు తహశీల్దార్, ఆర్‌డిఒ కార్యాలయాలు చుట్టూ తిరిగి వినతి పత్రాలు అందజేశామని పేర్కొన్నారు. చివరకు కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవించామని, అయినప్పటికీ తమకు న్యాయం జరగలేదని వాపోయారు. గ్రామంలో పెద్దలుగా చలామణి అవుతున్న కొందరు తమ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొందరు లబ్ధిదారుల వద్ద బెదిరింపులకు పాల్పడి చౌకగా భూములు లాగేసుకున్నారని, మిగిలిన భూములు కూడా ఆక్రమించుకునేందుకు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇటీవల తమ భూముల్లో బోరు వేసుకొని మామిడి పంట సాగు చేస్తున్నామని, ఊటుకూరు గ్రామానికి చెందిన గణేష్ రాజు, సతీష్ రాజు, లక్ష్మీకర్‌రెడ్డి, బాల అనేవారు గురువారం రాత్రి జెసిబి, డోజర్లతో తమ పొలాల్లోకి అక్రమంగా ప్రవేశించి హద్దు రాళ్లనుసైతం ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై బాధిత రైతులు శుక్రవారం తమ పొలాలు వద్ద కూర్చుని నిరసన తెలిపారు. అధికారులు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం డిఎస్‌పి చైతన్యకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పల్లపు సుబ్బరాయుడు, రామయ్య, బట్టల కష్ణయ్య, వెంకటయ్య, నంద్యాల జయరామయ్య, బలరామయ్య పాల్గొన్నారు.ఆందోళన చేస్తున్న బాధిత రైతులు










