
లేపాక్షి : శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలోని కొండూరు, కొర్లకుంట గ్రామాల్లో కుశలవ పరిశ్రమ ఏర్పాటు చేయకుండా మోసం చేసిన నేపథ్యంలో ఆ భూములను తిరిగి రైతులకు వెనక్కు ఇచ్చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. కుశలవ కోసం ఇచ్చిన భూముల్లో దళితులు, పేద రైతులు గురువారం నాడు కంపచెట్లను తొలగించి భూస్వాధీన ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దడాల సుబ్బారావు మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు జరిగితే గ్రామంలో ఉపాధి దొరుకుతుంది అని ఆశపడి రైతులు వారి సాగుభూములను ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. అందులో భాగంగానే లేపాక్షిలో అసైన్డ్ భూములను కుసలవ అనే ప్రయివేటు సంస్థకు కారుచౌకగా ఇచ్చారన్నారు. భూములు తీసుకున్న కుసలవ ఒక్క ఉద్యోగం కాదుకదా, పరిశ్రమ స్థాపన కోసం ఇటుక కూడా పేర్చలేదన్నారు. కళ్లెదుటే భూములు బీడుగా ఉండడంతో మోసపోయిన దళిత, బలహీన వర్గాల పేద రైతులు వాటిని తమకు వెనక్కు ఇవ్వాలని అధికారులను కోరారన్నారు. ఈ ప్రాంతంలో కుశలవ పేరుతో అక్రమంగా కొనుగోలు చేసిన 150 ఎకరాల భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ భూములను సాగుదారులకు ఇవ్వకుండా ప్రస్తుత అసైన్డ్ భూ పంపిణీలో భూస్వాములకు కట్టబెట్టె కుట్ర జరుగుతోందన్నారు. మోసపోయిన దళిత, పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. అసైన్మెంట్ చట్టం ప్రకారం పేదల భూములు పేదలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అంతవరకు పేదలపక్షాన పోరాటం సాగిస్తామన్నారు. పేదల భూస్వాధీన పోరాటం విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని పేదలతో మాట్లాడారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే అరెస్టులు చేస్తామని హెచ్చరించే ప్రయత్నం చేశారు. దీనిపై వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న స్పందిస్తూ పేదలు ఆందోళన చేస్తుంటే కేసులు పెడతామని బెదిరించడం సరికాదన్నారు. పేదల హక్కుగానే వారి భూములను స్వాధీనం చేసుకునే పోరాటం సాగిస్తున్నారని తెలియజేశారు. కేసులు పెడతామంటే భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యుల నారాయణ, రాయుడు, భూ పోరాట సాధన కమిటీ సభ్యులు గోపాలకష్ణ, రైతులు పాల్గొన్నారు.