ప్రజాశక్తి - గరుగుబిల్లి : మండలంలోని గొట్టివలస, ఉల్లిభద్ర రెవెన్యూ పరిధిలోని 79.5 ఎకరాల కొండ పోరంబోకు భూములను అటవీ శాఖకు అప్పగించేందుకు మండల రెవెన్యూ యంత్రాంగం ప్రయత్నించడాన్ని ఆ గ్రామాల ప్రజలు, దళితులు బుధవారం అడ్డుకున్నారు. ప్రతిపాదిత అటవీశాఖకు అప్పగించే అలోచన చేస్తున్న భూమిలో ఇప్పటికే 20 ఏళ్లుగా అనేకమంది సాగు చేసుకుని పట్టాలు పొంది ఉన్నారని, ఇంకా సాగు చేసుకుంటూ పట్టాలు పొందని వారు కూడా ఉన్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సాగు చేసుకున్న భూమిని ఎలా అటవీశాఖకు అప్పగిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ విషయమై కలెక్టర్, ఇతర అధికారులకు అనేక సందర్భాల్లో తెలియజేశా మని, అయినా అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ భూమికి అనుకొని సుంకి గ్రామ నిర్వాసితులకు పునరావాస కాలనీకి భూమి కేటాయించారని, నిర్వాసితులు, రైతులు తమ పశువులను, మేకలను పెంచుకునేందుకు ఈ భూమే ఆధారమని, అంతటి ప్రాధాన్యత కలిగిన భూమిని ఇతర అవసరాలకు బదలాయించడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో చర్చి నిర్మించారని, వారి మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిం చడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. కనీసం ప్రజలకు సమాచారం, పట్టాదారు లకు నోటీసు ఇవ్వకుండా రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తుందని, దీనిపై న్యాయ పోరాటానికి రైతులు సిద్ధపడుతున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన ఈ భూములను అటవీ శాఖకు బదిలాయించే ప్రయత్నం అడ్డుకుంటా మని హెచ్చరించారు. కార్యక్రమంలో సుంకి సర్పంచ్ కరణం రవీంద్ర, బివి రమణ, బోనెల వెంకటి, బోను నాగభూషణరావు, బోను శంకర్రావు, బొండపల్లి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.










