Oct 30,2023 20:26

కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న పేదలు, నాయకులు

పేదల భూములకు పట్టాలివ్వాలి
- సిపిఎం, వ్యకాసం నేతలు డిమాండ్‌
- కలెక్టరేట్‌ ఎదుట పేదలు ధర్నా
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     బండి ఆత్మకూరు మండలం సింగవరం, ఏ.కోడూరు గ్రామాలలో 20 సంవత్సరాల నుంచి పేదలు అనుభవిస్తున్న భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్‌లు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆయా గ్రామాల పేదలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ పేదల ఆధీనంలోని భూములకు పట్టాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ ప్రకారం 15 సంవత్సరాల నుండి అనుభవిస్తున్న సింగవరం పేదలకు పట్టాలు ఇచ్చి, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఏ.కోడూరు గ్రామంలో పోరంబోకు స్థలాల్లో 50 సంవత్సరాలుగా సాగు చేసి జీవనం చేస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని, కలెక్టర్‌, భూ పరిపాలన అధికారులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ అనుభవంలో ఉన్న పేదల భూములకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తే మండల కేంద్రంలో రహదారులను నిర్బంధం చేసి ఆందోళన చేపడతామన్నాఉ. వ్యకాసం జిల్లా కార్యదర్శి సుధాకర్‌ మాట్లాడుతూ పేదలందరూ ఐక్యంగా పోరాటాలు నిర్వహించి భూములను సాధించుకోవాలన్నారు. సిపిఎం మండల నాయకులు రత్నమయ్య, డేవిడ్‌, రాజు, వ్యకాసం మండల అధ్యక్షుడు సుబ్బరాయుడులు మాట్లాడుతూ పేదలు కొన్ని సంవత్సరాలుగా అనుభవంలో ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల అవినీతికి పాల్పడి ఆన్లైన్లో అనుభవంలో లేనివారి పేర్లను నమోదు చేశారని, వీటిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు, ఆయా గ్రామాల పేదలు పాల్గొన్నారు.