ప్రజాశక్తి-అనకాపల్లి
పేదల భూములను కబ్జా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని వల్లూరు గ్రామం 159 సర్వే నెంబర్లో గతంలో రిక్షా కార్మికులకు ఇళ్ల స్థలాల నిమిత్తం కేటాయించిన భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జాకు యత్నిస్తున్నట్లు తెలుసుకున్న సిపిఎం నాయకులు శుక్రవారం ఆ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఎ.బాలకృష్ణ, ఆర్.శంకరరావు, గంటా శ్రీరామ్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఈ భూమిని కబ్జా చేసి పేదలకు అన్యాయం చేయడం తగదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించిన ఈ భూముల్లో వారికే జగనన్న గృహ నిర్మాణం పథకం కింద ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం చేయాలని కోరారు. కలెక్టర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎరుకువానిపాలెం, వల్లూరు, రాజుపాలెం గ్రామాల్లో ఇళ్లు లేని పేదలకు, కూలీలకు, వృత్తిపనివారికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ప్రాంతంలో లాజిస్టిక్ హబ్ పేరుతో పేద రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకున్న ఎటువంటి నిర్మాణం చేపట్టలేదని, తక్షణమే లాజిస్టిక్ హబ్ నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భూ సేకరణలో రైతులు కూలీలకు జీవనాధారమైన పంట భూములు బీడు భూములుగా మారాయని, వారికి చెల్లించాల్సిన నష్టపరిహారం, ప్యాకేజీలు నేటికీ ఇవ్వలేదని, తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం పేదలకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.










