Sep 01,2023 21:56

పోలీసులతో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌

      రొద్దం : ఏళ్ల తరబడి సాగులో ఉన్న పేదల రైతు కూలీలకు భూములు ఇచ్చేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ స్పష్టం చేశారు. మండల పరిధిలోని కోగిర, కంబాలపల్లి, శ్యాపురం, బీదానుపల్లి గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూస్వాధీన పోరాటం కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం కోగిర రెవెన్యూ గ్రామంలో వ్యకాసం, సిపిఎం ఆధ్వర్యంలో భూముల్లో నిరసన తెలిపారు. కూలీలు, రెండు ట్రాక్టర్లతో దుక్కి దున్ని భూములను చదును చేసి రాగులు, జొన్నలు విత్తారు. పేదలు భూముల్లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు వారి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో పోలీసులను పేదలు, వ్యకాసం నాయకులు ప్రతిఘటించారు. 20 ఏళ్ల నుంచి సాగు చేస్తున్న ఈ భూమిని తమకు ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వాలని చూడడం సరికాదన్నారు. ఇదే మా జీవనాధారం అని, ఈ భూమిని వదిలేది లేదని పోలీసులకు తేల్చి చెప్పారు. కళ్లముందే మా భూమి ట్రస్ట్‌ పేరుతో దురాక్రమణ అవుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు. అక్కడి నుంచే పెనుకొండ సిఐ కరుణాకర్‌ ఫోన్‌ ద్వారా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌తో మాట్లాడారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించకునేందుకు ఇరువర్గాలు శనివారం ఉదయం సిఐ కార్యాలయానికి రావాలని కోరారు. ఇంతియాజ్‌ స్పందిస్తూ చర్చలకు తప్పక వస్తామని, అంతవరకు స్వాధీన పోరాటాన్ని యథావిధిగా కొనసాగిస్తూనే ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, సహాయ కార్యదర్శి గంగాధర్‌, జిల్లా కమిటీ సభ్యులు నారాయణ, వ్యవసాయ కూలీలు రామాంజినమ్మ, అనిత, సుబ్రహ్మణ్యం, బాలు, నారాయణ పాల్గొన్నారు.