ప్రజాశక్తి - బెలగాం : పేదలు, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిబసు అని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో పశ్చిమబెంగాల్ మాజీ సిఎం జ్యోతిబసు 109 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం రెడ్డి వేణు మాట్లాడుతూ పేదల కోసం, బడుగు, బలహీన వర్గాలు, దళిత గిరిజనుల కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. విదేశాల్లో చదువుకొన్న ఆయన స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వరాజ్యం కోసం రైతుల్ని, కార్మికుల్ని పెద్ద ఎత్తున కదిలించి పోరాడిన యోధుడన్నారు. 24ఏళ్ల పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ రాష్ట్రాన్ని భారతదేశంలోని ఆదర్శ రాష్ట్రంగా నడిపిన వ్యక్తి పేదలకు భూమి పంచారన్నారు. కౌలు రైతులకు కౌలుదారులు చట్టం తీసుకొచ్చి న్యాయం చేశారన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని, పార్టీ విధానానికి లోబడి పని చేశారని, ఈరోజు ఆయన లేకపోయినా ఆయన ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై.మన్మధరావు, ఆర్.శ్రీదేవి, వి.ఇందిర, సుందరమ్మ, పి.వరాలు, పి.రాము, తులసి, రాజు తదితరులు పాల్గొన్నారు.










