Mar 27,2023 01:26
గంగవరం మెడికల్‌ క్యాంపులో రోగులను పరీక్షిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి-పంగులూరు: వైద్యం ఖరీదు అయిపోతున్న ఈ రోజుల్లో, పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు లేరని, పేదవారి ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా చేసుకొని, గంగవరం ఆరోగ్య, సంక్షేమ వేదిక పనిచేస్తుందని, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మంచాల రమేష్‌ అన్నారు. ఇంకొల్లు మండలం గంగవరం గ్రామంలో, రెండు నెలలకు ఒకసారి గంగవరం ఆరోగ్య సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత రెగ్యులర్‌ మెడికల్‌ క్యాంపు ఆదివారం జరిగింది. మంచాల వెంకటరామయ్య, రంగమ్మ కళ్యాణ వేదికలో ఈ మెడికల్‌ క్యాంపు జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా ఉచిత రెగ్యులర్‌ మెడికల్‌ క్యాంపు నిర్వహిస్తు న్నామని, ఈ క్యాంపునకు దాతల సహకారం ఎంతో ఉందని అన్నారు. పేదలకు తక్కువ ఖర్చుతో, మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని, పేదలంతా ఈ మెడికల్‌ క్యాంపును ఉపయోగించుకోవాలని అన్నారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రం మాజీ కార్యదర్శి వై సిద్దయ్య మాట్లాడుతూ, గంగవరం ఆరోగ్య, సంక్షేమ వేదిక ద్వారా ఈ ప్రాంత ప్రజలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఈ వేదిక సేవలను విస్తృతం చేసి, మరింతమంది ప్రజలకు సేవ చేయాలని అన్నారు. కరి సత్యనారాయణరావు మాస్టారు స్మారకార్థం, ఆయన భార్య సక్కుబాయి, కుటుంబ సభ్యులు గోపికృష్ణ, అజరు కుమార్‌, డాక్టర్‌ జీవన జ్యోతి, ఈ మెడికల్‌ క్యాంపునకు ఆర్థిక సహకారం అందజేశారు. క్యాంపులో డాక్టర్‌ మంచాల రమేష్‌తో పాటు, పంగులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్‌ మల్లికార్జునరావు, డాక్టర్‌ కొత్త రాజేంద్ర రోగులను పరీక్షించి, వైద్య సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్‌ అన్నవరపు సాంబయ్య ప్రారంభించగా, మందుల పంపిణీలో ఎం వెంకటరావు, ఎం అరుణ, కే బాలచందర్‌, ఉపాధ్యాయుడు టి శ్రీనివాసరావు, రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, ఉపాధ్యాయులు ఏ సుబ్బారావు పాల్గొన్నారు.