May 12,2023 21:04

చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక స్వగృహంలో బాధితులకు చెక్కులు అందజేసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మొత్తం రూ.10.20 లక్షల చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. కార్వన్‌పేటకు చెందిన నరసింహులు కాళ్లకు ఆపరేషన్‌ చేయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.4.20 లక్షలు అందించినట్లు చెప్పారు. పెద్దతుంబలం గ్రామానికి చెందిన జంగాల రంగమ్మకు చర్మం కాలిపోగా రూ.1.40 లక్షలు, ప్రశాంత్‌ నగర్‌కు చెందిన చంద్ర లివర్‌ వ్యాధితో చనిపోగా చంద్ర భార్యకు రూ.3.20 లక్షల చెక్కును అందించినట్లు తెలిపారు. మరాఠి గేరికి చెందిన బండి చాంద్‌ కాళ్లకు ఆపరేషన్‌ చేయించగా రూ1.20 లక్షలు, పెద్దహరివాణం గ్రామానికి చెందిన గర్జప్ప కడుపుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండగా రూ.20 వేలు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎలాంటి వ్యాధికైనా ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్పత్రిలో కూడా ప్రజలకు చికిత్స చేసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అవకాశం కల్పించారని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ఎవరైనా ఆరోగ్యశ్రీ లేని వ్యాధులకు చికిత్స చేసుకున్న తర్వాత అయిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను నెలలోపు ఇవ్వడానికి ప్రయత్నించాలని కోరారు. 2024లో కూడా జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మధుసూదన్‌, వైసిపి సీనియర్‌ నాయకులు మురళీ రెడ్డి, నగరూరు చంద్రశేఖర్‌ రెడ్డి, ఆర్‌టిసి రెహమాన్‌, ఇదాయత్‌, బాబు, నాగరాజు పాల్గొన్నారు.