
ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్ : పేదల ఆకలి తీరాలని, రైతులు ఆత్మగౌరవంతో బతకాలని ఆలోచించిన మహోన్నత వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ అని నాయకులు గుర్తు చేసుకున్నారు. హరిత పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సమస్మరణ సభ వడ్డేశ్వరంలోని కెబి భవన్ (రైతు సంఘం రాష్ట్ర కార్యాలయం)లో శనివారం నిర్వహించారు. సభకు రైతుసంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ నేడు దేశంలో 140 కోట్ల ప్రజలకు ఆహార సమకూర్చడమే కాక, ఇతర దేశాలకు గోధుమలు, వరి, వంటి ఆహార ధాన్యాలను సరఫరా చేసేందుకు ప్రధాన కారణం స్వామినాథన్ పరిశోధనలని చెప్పారు. సీలింగ్ భూములు, బంజర భూములను పేదలకు సాగు చేసుకునేందుకూ ఆయన కారణమన్నారు. రైతు ఆత్మహత్యలను స్వయంగా పరిశీలించి తన అధ్యయనాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించారని, కనీస మద్దతు ధర, ఆర్థికంగా రైతు అభ్యున్నతి కోసం పలు సిఫార్సుల చేశారని చెప్పారు. వ్యవసాయం మీద ఆధారపడే ఆదివాసీలు, మహిళా రైతులను సైతం ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారని అన్నారు. ఆయన సిఫార్సులను ప్రభుత్వాలు అమలు చేసేలా పోరాటాల ద్వారా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్న్నారు. కౌలురైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు, కౌలు రైతులు సమస్యల పరిష్కారానికి స్వామినాథన్ విశేషంగా కృషి చేశారని అన్నారు. ఆహార కొరతతో ఉన్న దేశాన్ని సమృద్ధిగా ఆహార నిల్వలుండి ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా కృషి చేసిన మహోన్నత శాస్త్రవేత్త స్వామినాథన్ అని కొనియాడారు. అయితే ప్రభుత్వాల విధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలో ఉందని, హరిత విప్లవం తెచ్చిన కొన్ని రాష్ట్రాల్లోనూ వ్యవసాయ రంగంలో వెనకబడిందని తెలిపారు. విత్తనాలపై బహుళ జాతి కంపెనీలు ఆధిపత్యం చేస్తున్నాయని, రైతు వ్యతిరేక విధానాలను స్వామినాథన్ స్ఫూర్తితో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. డాక్టర్ స్వామినాథన్ కుటుంబం, అల్లుడు ప్రముఖ శాస్త్రవేత్తగా అభ్యుదయ భావాలతో సేవలు అందిస్తున్నారని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు మాట్లాడుతూ స్వాలంబన అంటే వ్యవసాయం అని నిర్వచనం చెప్పిన ఏకైక వ్యక్తి స్వామినాథన్ అని గుర్తు చేశారు. కొత్త వంగడాల తయారీలో ఆయన కృషి ఎనలేనిదన్నారు.వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక రైతులు ఆత్మహత్యలు పెరిగాయని, వ్యవసాయం సంక్షేభంలో పడిందని అన్నారు. దేశాన్ని, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తొలుత స్వామినాథన్ చిత్రపటానికి నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు. ఇరిగేషన్ ఇంజినీర్ చెరుకూరి వీరయ్య చౌదరి, రైతాంగ ఉద్యమ నాయకులు ఎర్నేని నాగేంద్రనాథ్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, ఉపాధ్యక్షులు వి.శివనాగరాణి రైతుకూలీ సంఘం నాయకులు ఝాన్సీ, వివిధ రైతు సంఘాల నాయకులు నరసింహారావు, నరేంద్ర, వైె.వెంకటేశ్వరరావు, వెంకటరెడ్డి, కె.రాజశేఖర్‌రెడ్డి, జొన్న శివశంకరరావు, కె.అజరు కుమార్, డి.వెంకటరెడ్డి, ఎం.శివసాంబిరెడ్డి, బి.శ్రీనివాసరావు, ఆంజనేయులు, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.వెంకటేశ్వరరావు, శివరామకృష్ణయ్య, ఎ.సాంబిరెడ్డి, బి.శివారెడ్డి, పి.కృష్ణ పాల్గొన్నారు.