Dec 27,2020 11:57

గతేడాదిగా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా వ్యాప్తి చెందడంతో పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు తప్పనిసరి అయ్యాయి. కానీ నిరుపేద కుటుంబాలకు ఆన్‌లైన్‌ క్లాసులు వినే ఆర్థిక స్థోమత ఎక్కడిది? కాబట్టి వారి చదువులు అటకెక్కాల్సిందేనా? అని ఆ వృద్ధ దంపతులు ఆలోచించారు. ఎలాగైనా అలాంటి చిన్నారులను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. సుమారు 170మందికి పైగా పేద విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతూ ఎందరో మన్ననలు పొందుతున్నారు బెంగళూరుకు చెందిన బద్రీనాథ్‌ దంపతులు. అసలు వారికెలా ఈ ఆలోచన వచ్చిందో తెలుసు కుందాం పదండి.


బెంగళూరుకు చెందిన 82 ఏళ్ల బద్రీనాథ్‌ విట్టల్‌ రిటైర్డ్‌ సివిల్‌ ఇంజనీర్‌. ఆయన భార్య 77 ఏళ్ల ఇందిరా విట్టల్‌ గృహిణి. 'ఆరు సంవత్సరాల క్రితం మా ఇంటి పనివారుగా పనిచేసే ఆమె కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. ఆ అమ్మాయిని ట్యూషన్‌ చేర్పించడానికి డబ్బుల్లేక ఇబ్బందులు పడుతోంది. అప్పుడే మేము నిర్ణయించుకున్నాం. ఆ అమ్మాయికి ఉచితంగా చదువు నేర్పాలని. నేను సైన్స్‌, మ్యాథ్స్‌. నా భార్య లాంగ్వేజీలతో పాటు సోషల్‌ సబ్జెక్టు చెప్పడం మొదలెట్టాము. కొన్నిరోజుల్లోనే ఆమె రెండవ కుమార్తె కూడా మా దగ్గర చదువు నేర్చుకోవడం మొదలెట్టింది. తర్వాత మా ప్రాంతంలోని ఇంటి పనివారు, మరికొంతమంది రోజువారీ కూలీల అభ్యర్థన మేరకు ఎనిమిది మంది విద్యార్థులకు ట్యూషన్‌ చెప్పడం ప్రారంభించాం. కొంతకాలం క్రితం లాక్‌డౌన్‌ ప్రకటించారు. దాంతో పిల్లలు ట్యూషన్‌కి రాలేకపోయారు. మరి వారి చదువు పరిస్థితి ఎలా? అని ఆలోచించాం. ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మా గురించి ఆనోటా ఈనోటా తెలుసుకున్న స్థానిక పత్రిక వార్త రాసింది. అంతే ఈ విషయం కొంతకాలంలోనే కర్ణాటక అంతా వ్యాపించింది. చాలామంది పేద తల్లిదండ్రులు తమ పిల్లలకూ ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పాలని అభ్యర్థన చేయడం మొదలెట్టారు. ఎనిమిది మందితో మొదలైన మా క్లాసులు నేడు 170 మందికి పైగానే చేరింది' అంటున్నాడు బద్రీనాథ్‌.
ప్రస్తుతం బద్రీనాథ్‌ దంపతులు రోజంతా క్లాసులు చెప్పడంలో బిజీగా ఉంటున్నారు. 'మా గురించి తెలుసుకున్న హవేరి, దొడ్డబల్లాపూర్‌, గంగవతి గ్రామ ప్రజలూ తమ పిల్లలకు చదువు చెప్పాలనీ, తమకు స్మార్ట్‌ఫోన్‌లు కొనే ఆర్థిక స్థోమత లేదనీ చెప్పారు. ఆ మాట విన్న వెంటనే వారి నిస్సహాయత చూసి బాధేసింది. వెంటనే నా స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి, 30 మందికి పైగానే స్మార్ట్‌ఫోన్‌లు అందజేశాం. మా ఆన్‌లైన్‌ క్లాసుల్లో పాల్గొనాలని విద్యార్థులే కాదు, కొందరు విశ్రాంతి ఉపాధ్యాయులు కూడా ఉత్సాహపడుతున్నారు. పదిమందికి పైగానే వాలంటీర్లు ఉన్నారు. ప్రస్తుతం తరగతి పాఠాలతో పాటు స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులనూ జరుపుతున్నాము. నేడు 170మందికి పైగానే విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసుల్లో ఉన్నారు. స్వచ్ఛందంగా పనిచేయాలనుకునే వారు 9901841508, 9900408760 నెంబర్లను సంప్రదించవచ్చని అంటున్నారు' బద్రీనాథ్‌.