రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్
పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఒక మనిషి తల రాతను మార్చడానికి చదువుకు మాత్రమే సాధ్యమని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను బాగా చదివించాలని రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ గ్రౌండ్‌లో మదనపల్లె నియోజకవ ర్గానికి సంబంధించి అమ్మ ఒడి మెగా చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యాభివద్ధికి అధిక నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారని చెప్పారు. కలెక్టర్ గిరీష పిఎస్ మాట్లాడుతూ నాణ్యమైన విద్య, ప్రతి ఒక్కరికి ఉచితంగా అందజేయాలనే ఆశయంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. పిల్లలందరూ రోజూ బడులకు వెళ్లాలని 75 శాతానికి తక్కువ కాకుండా హాజరు ఉండాలన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్‌బాష మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని విద్యార్థులు బాగా చదివి ఇంజనీర్లు డాక్టర్లు కావాలన్నారు. విద్యాభివద్ధికి ప్రభుత్వం అందించే పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మదనపల్లె నియోజకవర్గంలోని అర్హత కలిగిన తల్లులకు ఒక్కొక్కరికి రూ.15,000 వేలు చొప్పున 110290 మంది విద్యార్థుల తల్లులకు సంబంధించి రూ.165.44 కోట్ల రూపాయల మెగా చెక్కును విద్యార్థుల తల్లులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు జడ్‌పి చైర్మన్ వాసు, ఏపీఎండిసి చైర్మన్ షమీం అస్లాం, మున్సిపల్ చైర్మన్ మనోజ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జింక చలపతి, ఆర్డీవో మురళి, డీఈవో పురుషోత్తం, విద్యార్థులు పాల్గొన్నారు.
అమ్మఒడి మెగా చెక్కును తల్లులతకు అందజేస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి










