ప్రజాశక్తి - భామిని : విద్యకు పేదరికం అడ్డుకాకూడదని అమ్మ ఒడి ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక చేయూత, నాడు -నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి అన్నారు. మండలంలోని బాలేరు ప్రాథమిక పాఠశాలలో జెసిఎస్ కో ఆర్డినేటర్ కొత్తకోట చంద్రశేఖర్ అధ్యక్షతన అమ్మఒడి నాలుగో విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో రూపురేఖలు మార్చామన్నారు. తల్లిదండ్రులకు విద్యార్థి చదువు భారంకాకుండా జివికె కిట్ల రూపంలో అన్ని రకాలు వస్తువులు అందిస్తున్నామన్నారు. అనంతరం అమ్మఒడి ద్వారా మండలంలో 4,332మంది విద్యార్థులకు మంజూరైనా రూ.56,31,6000 చెక్కును విద్యార్థులకు అందజేశారు. అనంతరం జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా పలువురికి మంజూరైనా ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమం వైస్ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు, జెడ్‌పిటిసి బొడ్డేపల్లి చిన్నమ్మి, సర్పంచ్ జామి ప్రభాకర్, కార్పొరేషన్ డైరెక్టర్ మెడిబోయిన చలపతిరావు, పిఎసిఎస్ చైర్మన్ గెల్లంకి రమేష్, వైసిపి సీనియర్ నాయకులు కొత్తకోట ఆంజనేయులు, ఎంఇఒ శ్రీనివాసరావు, భాస్కరావు, వివిధ పంచాయతీల ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.
సీతంపేట : స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నాలుగో విడత జగనన్న అమ్మఒడి చెక్కును ఎమ్మెల్యే వి.కళావతి, ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలోని బడుగు, బలహీన వర్గాల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ఈ పథకాల ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అనంతరం 6,075 మంది లబ్ధిదారులుకు రూ.7,89,75,000 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి బిడ్డిక ఆదినారాయణ, జెడ్‌పిటిసి ప్రతినిధి సవర రాము, మండల కన్వీనర్ సుమిత్ర, జడ్పి కోఆప్షన్ సభ్యులు సవర లక్ష్మి, ఎంఇఒలు ఎం.ఆనందరావు, వి.సూర్యచంద్రరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.చంద్రరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసిపి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










