Aug 01,2023 17:09

నిరసన తెలుపుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

పేద విద్యార్ధులకు వైద్య విద్య దూరం చేయొద్దు
- మెడికల్‌ సీట్లను అమ్మడం దుర్మార్గం : ఎస్‌ఎఫ్‌ఐ
- 107, 108 ఉత్తర్వులను నిరసిస్తూ ధర్నా
ప్రజాశక్తి - నంద్యాల

రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్య సీట్ల భర్తీలో విద్యా వ్యాపారానికి ఎర్రతివాచి పరిచి బలహీన వర్గాల విద్యార్ధులకు వైద్య విద్యకు దూరం చేయవద్దని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నిరంజన్‌, జిల్లా సహాయ కార్యదర్శులు కిరణ్‌, ప్రతాప్‌లు పేర్కొన్నారు. వైద్య విద్య సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 107, 10 ఉత్తర్వులను నిరసిస్తూ అధ్వర్యంలో మంగళవారం స్తానిక పద్మావతి నగర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో వైద్య కళాశాలలను ప్రారంభిస్తున్నామని పెద్దఎత్తున రాజకీయ ప్రచారం చేసుకుంటుందని, నేడు ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలల్లో సీట్లు అమ్ముకునేందుకు 107, 108 ఉత్తర్వులు తీసుకొచ్చారని విమర్శించారు. ఈ సీట్ల అమ్మకం ఐదు కళాశాలలతో ప్రారంభమై భవిష్యత్తులో అన్ని కళాశాలల్లో దీనిని అమలు చేస్తారని, ఇది వైద్య విద్య పేదలకు దూరం చేయడమేనని అన్నారు. మూడు కేటగిరిలుగా సీట్లను భర్తీ చేసి వాటిలో 50 శాతం సీట్లను సెల్ఫ్‌ఫైనాన్స్‌, ఎన్‌ఆర్‌ఐ భర్తీ ద్వారా కళాశాలలను వ్యాపార కేంద్రాలుగా తయారుచేస్తున్నారని విమర్శించారు. 25 శాతం సీట్లను మాత్రమే రిజర్వ్‌గా కేటాయించడం అంటే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టి విద్యార్ధులకు ద్రోహం చేసినట్లే అన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో నూతన కళాశాలలు ప్రారంభిస్తున్నా కన్వీనర్‌ కోటాలోనే సీట్ల భర్తీ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి విద్యలో చేపడుతున్నట్లు విప్లవాత్మమైన మార్పులు అంటే బలహీన వర్గాల ప్రజలకు విద్యను దూరం చేయడమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో డబ్బు ఉన్నవాడికి, పేద వాడికి వార్‌ జరుగుతుందని, అదే క్లాస్‌ వార్‌ అని నిరంతరం ఉదరగొడుతున్న సిఎం సీట్ల కేటాయింపుతో ఎవరి పక్షమో ప్రజలకు అర్ధమైందని అన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి వెంటనే ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని పేద విద్యార్ధులకు వైద్య విద్యకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పెద్ద యెత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.