
ప్రజాశక్తి -తగరపువలస : తాత ముత్తాతల నుంచి తమ అనుభవంలో ఉన్న ఇనాం భూములపై తమకు పూర్తి హక్కులు ఉండగా, తమ భూములను చట్ట విరుద్ధంగా క్రయ విక్రయాలు జరిపిన బడాబాబుపై ప్రేమ ఒలక బోయడంలో ఆంతర్యం ఏమిటని సిఐటియు నాయకులు రవ్వ నరసింగరావు, పలువురు ఇనాం భూ సాగు దారులైన రైతులు కనకల వెంకట రమణ, అల్లు చిన్నయ్య, కాళ్ళ ఆదినారాయణ, కనకల సన్యాసి నాయుడు తదితరులు స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావును సూటిగా ప్రశ్నించారు. పేద రైతుల పక్షాన ఉంటారా? రైతులను మోసగించిన బడా బాబు పక్షం ఉంటారో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల లక్ష్మీపురంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొని నారాయణ రాజు పేట ఇనాంభూములకు సంబంధించి బడా బాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి కైనా సరే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, రైతులకు అండగా నిలవాలని ఎమ్మెల్యేను కోరారు. అలా కాని పక్షంలో వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతామని ఖరా ఖండిగా తేల్చి చెప్పారు.