Aug 09,2023 00:18

ఈఈకి వినతిపత్రం అందచేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : పెదవడ్లపూడి హైలెవెల్‌ ఛానల్‌ ఎత్తిపోతల పథకం వెంటనే పూర్తి చేసి 6 మండలాల పరిధిలోని 25 ఎకరాల సాగు భూమికి నీరు విడుదలయ్యేలా చూడాలని ఎపిఎస్‌ఐడిసి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎం.రవిశంకరన్‌, ఎఇ సుబ్బారావుకు రైతు సంఘ: నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జొన్నా శివశంకర్‌, కంచుమాటి అజరుకుమార్‌ మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్‌ నుండి బంకింగ్‌ హామ్‌ కాల్వ ద్వారా కృష్ణా, పశ్చిమ డెల్టాకు సాగునీరు వస్తుందని, బంకింగ్‌ హామ్‌ కాల్వ కంటే ఎత్తులో పెదవడ్లపూడి హైలెవెల్‌ ఛానల్‌ ఉండటం వలన బంకింగ్‌ కెనాల్‌లో ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు మాత్రమే నీరు వస్తోందని చెప్పారు. బంకింగ్‌ హోమ్‌ కెనాల్‌లో నీటి ప్రవాహం 2000 క్యూసెక్కుల కంటే తక్కువగా ఉన్నప్పుడు నీరు సక్రమంగా అందట్లేదని, సమస్య పరిష్కారానికి 2017లో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారని, రూ.9 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయని వివరించారు. ఈ పథకానికి అవసరమయ్యే మోటారు పంపులు వచ్చాయని, వీటిని అమర్చే పనులు చేయాల్సి ఉందన తెలిపారు. కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించకపోవడం వలన ఈ ఆరేళ్ల నుంచి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే నిధులను విడుదల చేసి ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చి సాగు భూమికి నీరు అందించాలని కోరారు. బడ్జెట్‌ వచ్చిన వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేసి రైతులకు న్యాయం చేస్తామని ఇఇ హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి, కె.పూర్ణచంద్ర ఉన్నారు.