Aug 13,2023 21:43

ఖాళీ బిందెలతో ర్యాలీ చేస్తున్న మహిళలు

బలిజిపేట: మండలంలోని పెదపెంకిలో గత నెల రోజులుగా గ్రామస్తులు దాహం కేకలు పెడుతున్నారు. ఈ మేరకు నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకులు ఈర్ల సంజీవనాయుడు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆదివారం ఖాళీ బిందెలతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని కొత్త వీధి, బీసీ కోలనీ, దళితవీధి, తెలగ వీధులకు గత నెల రోజులుగా మంచినీరందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయినా సంబంధిత అధికారులు కానీ, స్థానిక అధికారులు కానీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మండల స్థాయి అధికారులు, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు మంచినీరు ఏర్పాటు చేయడంలో విఫలమవ్వడం వారు చేస్తున్న విధుల నిర్వహణకు ఉదాహరణగా చెప్పొచ్చని విమర్శించారు. గ్రామంలోని మండల స్థాయి నాయకులున్నప్పటికీ ప్రజల సమస్యలు కనిపించకపోవడం బాధాకరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీరందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.