ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి/ క్రోసూరు : పెదకూరపాడు నియోజకవర్గానికి సిఎం జగన్ మోహన్‌రెడ్డి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్రంలో నాలుగో విడత జగనన్న విద్యాకానుక (జెవికె) కిట్లను పంపిణీని పల్నాడు జిల్లా క్రోసూరులో సిఎం సోమవారం ప్రారంభించారు. విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఎం మాట్లాడుతూ పలు హామీలు ఇచ్చారు. సభలో స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రస్తావించిన అంశాలకు ఆమోదం తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా పలు గ్రామాల్లో సాగునీటి సరఫరాకు అవకాశం కల్పిస్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎమ్మాజిగూడెంలో 124 కుటుంబాలకు పునరావసం పూర్తి చేస్తామన్నారు. తాళ్లచెరువు గ్రామంలో రూ.45 కోట్లతో ఎత్తిపోతల పథకం, మాదిపాడు నుంచి పులిచింతల డ్యామ్ వరకు రూ.3.5 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా సరిగాలేదని ఇందుకోసం 133 కెవి సబ్‌స్టేషన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సంబంధించి సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరతామని, తర్వాత అనుమతిస్తామన్న సిఎం ఇతర అంశాను ఆమోదించారు.
అంతకు ముందు సిఎం క్రోసూరులోని మోడల్ పాఠశాలను ప్రారంభించి విద్యార్థులతో కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు. జెవికె కిట్ల నాణ్యతను పరిశీలించారు. స్కూల్ బ్యాగ్‌లను తగిలించుకుని నడిచారు. పాఠ్య పుస్తకాలను పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. డిజిటల్ క్లాసును వీక్షించారు. డిజిటల్ క్లాసు స్క్రీన్‌పై విద్యార్థులకు 'ఆల్‌దిబెస్టు' అని రాసి సంతకం చేశారు. విద్యార్థులతో ఫొటో దిగి ఆశీర్వదించారు. విద్యార్థులు సిఎంతో సెల్ఫీ దిగారు. అనంతరం జరిగిన సభలో ఆయన విద్యార్థులకు జెవికె కిట్లను పంపిణీ చేశారు. పల్నాడు, ఎన్‌టిఆర్ జిల్లాలను అనుసంధానం చేసే విధంగా కృష్ణా నదిపై మాదిపాడు-జగ్గయ్యపేట బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. అమరావతి-బెల్లంకొండ మార్గంలో డబల్ లైన్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. సభకు ముందు దాదాపుగంట సేపు విద్యార్థులతో ముచ్చటించారు. మోడల్ స్కూలు తరగతి గదులపరిశీలన, డిజిటల్ క్లాసుల పరిశీలన తరువాత విద్యార్థులకు అందించే కిట్లలో షూస్, ఇతర వస్తువుల నాణ్యత పరిశీలన చేశారు. సభ అనంతరం పెదకూరపాడు, సత్తెనపల్లికి చెందిన 170 మంది కార్యకర్తలు, స్థానిక నాయకులతో కలిసి మాట్లాడారు. గతంలో కంటే ఈసారి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 14 ఏళ్లలో ఏమీ చేయకుండా ఇప్పుడు డిక్లరేషన్లు పేరుతో వివిధ తరగతుల ప్రజలు మోసం చేయడానికి చంద్రబాబు ముందుకువస్తున్నారని దుయ్యబట్టారు.
విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి బొత్స
దేశంలోనే మన రాష్ట్రంలో విద్యా కీలకంగా సంస్కరణలు చేశామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి విద్యార్థీ ఉన్నతస్థాయిలో నిలబడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లో విద్యా బోధన అందిస్తున్నామని అన్నారు.
తుళ్లూరు రోడ్డు వేయలేకపోయారు : ఎమ్మెల్యే శంకరరావు
టిడిపి హయాంలో పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు విమర్శించారు. రాజధాని ఏర్పడిన తరువాత కూడా గత పాలకులు అమరావతి నుంచి తుళ్లూరుకు రోడ్డు వేయలేకపోయారని, వైసిపి అధికారంలోకి వచ్చాకే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందని అన్నారు.
పల్నాడుజిల్లాలో 1.80 లక్షలమందికి జెవికె కిట్లు
జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ మాట్లాడుతూ పిల్లలకు మనం ఇచ్చే అస్తి చదువేనన్నారు. మన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో నిలిపే విద్య కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మఒడి, నాడు - నేడు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, బైలింగ్వల్ పుస్తకాలు, ఇంటరాక్టివ్ విధానంలో ఇంగ్లీషు పాఠాలు, డిజిటల్ క్లాసులు వంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోందన్నారు. పల్నాడు జిల్లాలో 1,80,079 మంది విద్యార్థులకు రూ.45.02 కోట్లతో విద్యాకానుక కిట్లను పాఠశాల తెరిచిన మొదటి రోజే అందించబోతున్నామన్నారు. సభలో మంత్రులు బొత్సా సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, విడదల రజిని, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, ఎల్.అప్పిరెడ్డి, తలశిల రఘురాం, జంగాకృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.










