
ప్రజాశక్తి - పలాస: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలకు పెద్దపులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస మండలాల్లో సంచరించిన పెద్దపులి తాజాగా పలాస మండలంలోని అమలకుడియా, వీరభద్రాపురంలో తిరుగుతోంది. ఆ గ్రామాల్లోని పంట పొలాల్లో పెద్దపులి పాదముద్రలు రైతులకు కనిపించడంతో అలజడి రేగింది. రైతులు తమ పంట పొలాలు చూసేందుకు వెళ్తుండగా పాదముద్రలు కనిపించడంతో, సర్పంచ్ ప్రతినిధి కొర్ల మురళీకృష్ణ చౌదరి తహశీల్దార్ ఎల్.మధుసూదనరావు దృష్టికి తీసుకెళ్లారు. అటవీశాఖ అధికారులు పంట పొలాల్లో ఉన్న పాదముద్రలు అనుసరించి వెళ్లి పరిశీలించగా, అమలకుడియా పంట పొలాల నుంచి సమీపంలో ఉన్న పూర్ణభద్ర గెడ్డలో దిగి గట్టు ఎక్కినట్లు ఉన్నాయి. పాదముద్రల ఆధారంగా వీరభద్రాపురం కొండ వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో పూర్ణభద్ర, అమలకుడియా, వీరభద్రాపురం, అమలకుడియా కాలనీ ప్రాంతాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా అటవీశాఖ రేంజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ రాత్రి, వేకువజామున ఆరుబయటకు రావద్దని చెప్పారు. పశువులను గ్రామానికి దూరంగా కట్టవద్దన్నారు. పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.