Jul 25,2023 21:38

ప్రజాశక్తి - సాలూరు : సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పీఠం కోసం కుదిరిన పెద్దమనుషుల ఒప్పందం అమలయ్యే సమయం ఆసన్నమవుతోంది. ఒకవేళ ఈ ఒప్పందం అమలైతే రెండు నెలలే సమయం ముందుంది. గతంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చైర్‌పర్సన్‌ పీఠం కోసం పట్టణ వైసిపిలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. కౌన్సిల్‌లో మెజారిటీ కౌన్సిలర్‌ స్థానాలను కైవసం చేసుకున్న అధికారపార్టీకి చైర్‌పర్సన్‌ ఎంపిక అప్పట్లో కొంత తలనొప్పిగా మారింది. సీనియర్‌ నాయకులు పువ్వుల నాగేశ్వరరావు, జర్జాపు ఈశ్వరరావు గ్రూపుల మధ్య మున్సిపల్‌ ఎన్నికలు ఎత్తుకుపై ఎత్తులకు కేంద్ర బిందువుగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి పవనాలు బలంగా వీస్తున్న సమయంలో ఎన్నికలు జరగడంతో 20కౌన్సిలర్‌ స్థానాలను గెలుచుకుంది. చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎవరనేదానిపై పెద్ద హైడ్రామా నడిచింది. చైర్‌పర్సన్‌ కుర్చీ కోసం జర్జాపు ఈశ్వరరావు కుమార్తె నీలిమ, జర్జాపు సూరిబాబు కోడలు దీప్తి, పువ్వల నాగేశ్వరరావు భార్య ఈశ్వరమ్మ పోటీ పడ్డారు. పువ్వల కుటుంబానికి వైసిపి జిల్లా నాయకత్వం ఆశీస్సులు పుష్కలంగా వుండడంతో చైర్‌ పర్సన్‌ పీఠం ఈశ్వరమ్మకి దక్కింది. అయితే ఆ సమయంలో జర్జాపు కుటుంబాన్ని సంతృప్తి పరచడానికో, ఎన్నికల ఎత్తుగడలో భాగమో తెలియదు కానీ చైర్‌పర్సన్‌ పీఠం గురించి ఫిఫ్టీ ఫిఫ్టీ ఒప్పందం కుదిరింది. మొదటి రెండున్నర ఏళ్ల పాటు చైర్‌పర్సన్‌గా పువ్వుల ఈశ్వరమ్మ, తదుపరి రెండున్నర ఏళ్ల పాటు జర్జాపు దీప్తిని కొనసాగించాలని అప్పట్లో ఒప్పందం జరిగింది. ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఇప్పటి డిప్యూటీ సీఎం రాజన్నదొరల సాక్షిగా ఆ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో పెద్ద మనుషుల ఒప్పందం అమలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒప్పందం అమలు కోసం సీనియర్‌ నాయకులు జర్జాపు ఈశ్వరరావు, సూరిబాబు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఒప్పందం సూత్రధారులైన జెడ్పీ చైర్మన్‌, డిప్యూటీ సిఎంలపై జర్జాపు సోదరులు ఒత్తిడి పెంచుతున్నారు.
గాడి తప్పిన పురపాలన
గత కొంతకాలంగా పురపాలన గాడి తప్పుతోంది. చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ భర్త నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమె పురపాలనపై దృష్టి సారించకలేకపోతున్నారు. నాగేశ్వరావు ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఆయనే పురపాలనా వ్యవహారాలను పర్యవేక్షించే పరిస్థితి వుండేది. అయితే గత కొంతకాలంగా ఆ పరిస్థితి లేకపోవడంతో పురపాలన ఎవరికి వారే యమునా తీరే చందంగా తయారైంది. పట్టణంలో సుమారు రూ.6కోట్ల మేర అభివృద్ధి పనులు జరగకుండా ఉండిపోయాయి. కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. డిప్యూటీ సిఎం రాజన్నదొర కాంట్రాక్టర్లకు నచ్చజెపుతున్నా ఫలితం కనిపించడం లేదు.
చైర్‌ పర్సన్‌ మార్పు సాధ్యమా?
పెద్ద మనుషుల ఒప్పందం గడువు సమీపిస్తున్న తరుణంలో చైర్‌పర్సన్‌ మార్పు అనే అంశం తెరపైకి వస్తోంది. మరో ఆరునెలల్లో సాధారణ ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసిపి నాయకత్వం చైర్‌పర్సన్‌ మార్పుపై దృష్టి సారిస్తుందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా ఉంది. డిప్యూటీ సిఎం రాజన్నదొర వైసిపి అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పెద్ద మనుషుల ఒప్పందంలో ఆయన కూడా ఉన్నారు. ఈ ఒప్పందాన్ని అమలు చేసే అంశం పూర్తిగా ఆయన విచక్షణాధికారంపై ఆధారపడి ఉంది.
మారిన సమీకరణాలు
అధికారపార్టీలో రాజకీయ సమీకరణాలు మారాయి. రెండేళ్ల క్రితం నాటి పరిస్థితులు, ఇప్పుడు పట్టణ వైసిపిలో లేవు. గ్రూపులు యథాతథంగానే ఉన్నాయి. పెద్దమనుషుల ఒప్పందం జరిగిన నాటికి జర్జాపు సూరిబాబు పట్టణ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. కొద్దినెలల క్రితం ఆయన స్థానంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడును పట్టణ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. కొద్దినెలల క్రితం వరకు వైస్‌చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడుతో సహా మెజారిటీ కౌన్సిలర్లు ఒకే గ్రూపులో ఉండేవారు. ఆ తర్వాత కొంతకాలానికి వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు జర్జాపు గ్రూపు నుంచి విడిపోయి చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ గ్రూపులో కొనసాగుతున్నారు. గతంలో కౌన్సిలర్ల అభిప్రాయానికి వ్యతిరేకంగా చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపిక జరిగిందనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు కూడా పార్టీ నాయకత్వం పెద్ద మనుషుల ఒప్పందానికి కట్టుబడి వుంటుందా లేదా అనే చర్చ సాగుతోంది. పట్టణంలో పార్టీకి ఏకనాయకత్వం అవసరం ఉంది. చైర్‌పర్సన్‌గా సమర్ధులైన వ్యక్తి వుంటే పరిపాలన గాడిలో పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.