Aug 14,2023 21:02

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డివేణు

ప్రజాశక్తి - పాచిపెంట :  పేదల భూములను పెద్దలకు కట్టబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం 9/77 అసైన్డ్‌ భూములు చట్టాన్ని మార్పు చేయడం దుర్మార్గమని, ఇలాంటి విధానాలను తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. సోమవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. 2.50 ఎకరాలు భూమి ఉన్న పేదలందరికీ క్రమబద్ధీకరించాలని కోరుతున్నామని, ఈ భూములను అన్యాక్రాంతం చేసిన పెత్తందారులు, రియల్‌ ఎస్టేట్‌దారులకు భూస్వాములకు కట్టబెడితే జిల్లా వ్యాప్తంగా భూ పోరాటం భూములపై జెండాలు పాతి పేదల స్వాధీనం చేసుకుంటారని తెలిపారు. అసైన్డ్‌ భూములు పట్టాలు పొందిన రైతులంతా వారంలోపు తహశీల్దార్లకు దరఖాస్తు చేసుకొని తన భూములు కాపాడుకోవాలని కోరారు. అలాగే పాచిపెంట మండలంలో పద్మాపురంలో అసైన్డ్‌ భూముల్ని సాగు చేస్తున్న రైతులకు పట్టాలివ్వాలని కోరారు. కుడుమూరులో 748 ఎకరాల ప్రభుత్వ భూమి సర్వే చేసి పట్టాలివ్వకుండా మభ్యపెడుతున్నారని, వెంటనే సాగు చేస్తున్న గిరిజనులందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొండ తాడూరులో 210 ఎకరాలు సిపిఎం పోరాట ఫలితంగా ప్రభుత్వం సర్వే చేపట్టిందని, సర్వే చేసిన భూమిని సాగుదారులైన రైతులందరికీ పట్టాలివ్వాలని కోరారు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఇలా అన్యాక్రాంతమైన భూములు, పేదల సాగు చేస్తున్న డి-పట్టా భూములకు పట్టాలివ్వాలని, ఇప్పటికే వ్యవసాయ కూలీలు పోరాడుతున్నారని అన్నారు. ఆ భూములను వెంటనే వారికి అప్పగించాలని, లేనిచో భూ పోరాటం చేపట్టి, ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మర్రి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు పాల్గొన్నారు.