ప్రజాశక్తి-చీరాల: మేధావుల సభకు మేధావులనే పంపించుకుందాం అని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ వాటి సమస్యల పరిష్కారం కోసం పోరాడే పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వెంకటేశ్వరరెడ్డి బాబిరెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించుకోవాలని తద్వారా మాత్రమే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక శ్రామిక వర్గాల సమస్యల పరిష్కారం జరుగుతాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు కె ఉమా మోహన్ కె ధనలక్ష్మి లు అన్నారు. పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సిఐటియు, యుటిఎఫ్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో నాయకులు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమై దర్బార్ రోడ్డు, పేరాల, ఐటిసి, మసీద్ సెంటర్ కూరగాయల మార్కెట్ రోడ్డు తహశీల్దారు కార్యాలయం, గడియార స్తంభం సెంటర్ మీదగా సాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వైసిపి దిగజారుడు రాజకీయం చేసి ఎమ్మెల్సీ ఎన్నికలలో దొంగ ఓట్ల చేర్పులకు పాల్పడిందని అన్నారు. నేడు ఉద్యోగులను, ఉపాధ్యాయులను వైసిపి ప్రభుత్వం వేధిస్తూ వారికి సకాలంలో జీతాలు కూడా చెల్లించకుండా అనేక ఒత్తిళ్లకు గురి చేస్తూ వారిని రోడ్డుపైకి తెచ్చిందని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రభుత్వ వేధింపులు మానుకోవాలని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. గత మూడున్నర ఏళ్ల కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై వేధింపులు పాల్పడుతుందని ఆరోపించారు. సకాలంలో ఉద్యోగులకు జీతాలు అందించడం చేతకాని ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. ప్రభుత్వ తీరుపై ఎవరైనా నోరు మెదిపితే వారిపై అక్రమ అరెస్టులు, నిర్బంధ కాండలు చేయడం వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. గతంలో ఎప్పుడు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసిన సంఘటనలు లేవని అన్నారు. రిప్రజెంటేషన్ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నారని అన్నారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై ఎమ్మెల్యేలు మాట్లాడాలని అన్నారు.ఉద్యోగులను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయని స్పష్టం చేశారు. జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక, శ్రామిక వర్గాల ప్రజా సమస్యలపై శాసనమండలిలో మాట్లాడే పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సిఐటియు జిల్లాఅధ్యక్షులు సిహెచ్ మణిలాల్, నాయకులు ఎన్ బాబురావు, ఎం వసంతరావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జడ వినరు కుమార్, సహాధ్యక్షులు బిక్షాలు బాబు, కోశాధికారి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జానీ బాషా, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్ర రామారావు, ఎయిడెడ్ కన్వీనర్ కుర్ర శ్రీనివాసరావు, వెలుగొండరెడ్డి, రాజేష్, సయ్యద్ జానీ భాష, సిఐటియు నాయకులు సత్యమూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మనోజ్, కిరణ్, ఆర్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వి శివనాగరాని తదితరులు పాల్గొన్నారు.










