ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి
మండల పరిధిలోని నెల్లిపట్ల గ్రామంలో ఎస్సీ, ఎస్టీలకు కటింగ్ చేయబోమని బార్బర్ షాపు ఓనర్లు తెగేసి చెబుతున్నారు. ఈ పంచాయతీ పరిధిలో దాదాపు వెయ్యిమందికి పైగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి. వీరు కటింగ్ చేయించుకోవాలంటే బైరెడ్డిపల్లి మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. నెల్లిపట్ల గ్రామంలో చేసేది లేదని ఏమాత్రం జంకూ లేకుండా షాపు యజమానులు తెగేసి చెప్పేస్తున్నారు. ఎస్సీలు ఈ విషయమై నిలదీయగా 'మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి.. గ్రామ పెద్దలు చెప్పిన ఆదేశాల మేరకు మీకు మేం కటింగ్‌చేసేది లేదు' అని నిరాకరిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా తమ పట్ల వివక్ష చూడాన్ని ఎస్సీలు ప్రశ్నిస్తున్నారు. గ్రామపెద్దలు ఈ విధమైన నిర్ణయాలు చేసి వివక్షకు తావివ్వడాన్ని జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దళితులకు కటింగ్ చేయరాదని గ్రామ పెద్దలు నిర్ణయిస్తే ఇంకా అంబేద్కర్ రాజ్యాంగానికి విలువేముందని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామపెద్దలపై చర్యలు తీసుకుని, గ్రామంలోనే తమకూ కటింగ్ చేసేలా చూడాలని దళితులు కోరుతున్నారు.










