Dec 06,2020 12:42

         అనగనగా ఒక వ్యవసాయ పొలం మోటబావిలో కప్పలు, ముసలి తాబేలు నివాసముండేవి. బాండ్రుకప్ప పిల్ల, తాబేలు తాత అపుడప్పుడూ నూతిలోని బండరాతి మీద కూర్చుని, ఎండలో చలి కాచుకుంటుండేవి.
మిట్ట మధ్యాహ్న సమయంలో సూర్యుడి కాంతి నూతిలో పడి బాగా వెలుగు వచ్చేది. రాత్రైతే నూతి చీకటిగా ఉండేది. ఇలా ఎందుకు జరుగుతుంది? అని కప్పపిల్లకు సందేహం వచ్చి తాబేలు తాతను అడిగింది.
        'ఓ అదా! అదంతా వేరే ప్రపంచము. నూతి గట్టు బయట మనుషులు, పక్షులు, జంతువులు, కొండలు, చెట్లు ఉంటాయి. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, నక్షత్రాలు కనబడతాయి. సూర్యుడి వల్ల ఎండ వచ్చి, కాంతిగా ఉంటే పగలనీ, సూర్యకాంతి లేక నల్లగా ఉంటే రాత్రి అనుకుంటారు బయటి ప్రపంచజీవులు. అక్కడ పగలు, రాత్రి అనే తేడాలున్నాయి. కానీ మనకు ఇదే జీవితం' అని చెప్పాడు తాబేలు తాత.
        తాబేలు తాత మాటలు విన్న కప్పపిల్ల 'తాతా, తాతా! నూతి బయట ఉండే ప్రపంచాన్ని చూడాలని ఉంది' అని అడిగింది.
'వద్దురా.. బిడ్డా! అక్కడ మన ప్రాణాలకు రక్షణ లేదు. నీలాంటి చిట్టి ప్రాణుల్ని పాములు, గుడ్లగూబ, డేగలాంటి పక్షులు పట్టుకు తినేస్తాయి. వేసవి కాలంలో చెరువులు, గుంతలు, నూతులు, నదులు నీరులేక ఎండిపోతాయి. నీళ్లు లేకపోతే మనం సచ్చిపోతాం! ఇక్కడైతే సంవత్సరం పొడవునా నీరుండి నాచు, పురుగులు, ఆకులు మనకు ఆహారంగా లభిస్తాయి. చిన్నప్పుడు అక్కడి ప్రపంచాన్ని దగ్గర నుంచి చూశా. అప్పట్లో మా అమ్మా, నాన్నతో పాటు ఒక పెద్ద చెరువులో నివాసం ఉండేవాడిని. మత్స్యకారులు చేపలు పట్టడానికి చెరువులో వల వేస్తే అమ్మానాన్న వారికి దొరికిపోయారు. ఆ సమయంలో చెరువు గట్టు మీద ఆడుకుంటున్న నన్ను చూసి కొందరు పిల్లలు ఈ మోటబావిలో పడేశారు. అప్పటి నుంచి ఎలాంటి భయం లేకుండా హాయిగా ఉన్నా' అంటూ చెప్పుకొచ్చింది తాబేలు.
       అయినా కప్పపిల్ల బయటి ప్రపంచం చూడాలని ఉందని పట్టు పట్టింది. చివరికి తల్లి కప్ప మందలించడంతో అప్పటికీ ఆ ఆలోచనను విరమించుకుంది పిల్ల కప్ప. కొద్దిరోజుల తర్వాత వర్షాలు పుష్కలంగా కురిసాయి. మోటబావి నిండా నీళ్లుచేరి గట్టు వరకూ రావడంతో పొలం యజమాని వ్యవసాయానికి మోటబావి నీళ్లు తోడటం మొదలెట్టాడు.
       ఇదే అదను అనుకుని కప్పపిల్ల మోట బకెట్లో దూకింది. నీటితో పాటు గట్టుపైకి వచ్చింది. కప్పపిల్లను గమనించి, తాబేలు తాత హెచ్చరించేలోపే మోటబకెట్టు పైకి వెళ్ళిపోయింది. తాత కేకలు విన్న తల్లికప్ప గాబరా పడసాగింది.
నీటితో పాటు గట్టు పైకి చేరిన కప్పపిల్ల పంట పొలాల్ని, గట్టు మీదున్న చెట్లనీ చూసి ముచ్చటపడుతూ ఉంది. అంతలోనే పొదల్లోంచి పెద్ద నాగుపాము బుస్సున పైకి వచ్చి కప్పపిల్లను మింగబోయింది. అంతలోనే పామును చూసిన రైతు కట్టె తీసుకుని దానిని చంపేశాడు.
       కప్పపిల్ల ఇంకా ముందుకు వెళ్దామని గెంతుకుంటూ వెళ్లబోయింది. ఇంతలో చెట్టు మీదున్న గద్ద ఎగురుతూ వచ్చి కప్పపిల్లని కాళ్లతో పట్టుకోబోయింది. గబుక్కున బురద గుంటలో దూకి ప్రాణం రక్షించుకుంది. 'బాబోరు, తాబేలు తాత చెప్పినట్టు బయటి ప్రపంచమంతా ప్రమాదకరమని గ్రహించింది. మెల్లగా గట్టు దగ్గరకు వచ్చి ఖాళీ మోట బకెట్లో దూకి, నూతిలోకి చేరింది. అందుకే అంటారు 'పెద్దలమాట సద్దిమూట' అని అనుకుంది కప్పపిల్ల. ప్రాణాలతో తిరిగి వచ్చిన కప్పపిల్లను చూసి తాబేలు, తల్లికప్ప సంతోషించాయి.

- కందర్ప మూర్తి,
8374540331