ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి పేదలకు చెందిన జిల్లాలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు పెద్దల చేతుల్లోకి వెల్లిపోయాయి. దళితులు, బిసిలు, మైనారిటీలకు చెందిన వీటిని భయపెట్టి, మభ్యపెట్టి, తక్కువ ధర ఆశ చూపి కారు చౌకగా కొట్టేశారు. దీంతో అనేక ప్రాంతాల్లో భూస్వాముల కబంద హస్తాల్లో ఈ భూములున్నాయి. వైసిపి ప్రభుత్వం అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఎపి అసైన్డ్ ల్యాండ్స్ సవరణ ఆర్డినెన్స్‌ను ఈ ఏడాది జూలై 27న తీసుకొచ్చింది. దీని ప్రకారం 2003 జూలై 31కి ముందు కేటాయించిన భూములపై ఉన్న ఆంక్షలు తొలగించి, పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించేందుకు సిద్ధపడింది. జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ఈ ఏడాది ఆగస్టు 2వ వారం నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాలు మినహా దాదాపుగా సర్వే పూర్తి అయింది. 50 శాతం అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయినట్టు సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
30 శాతం భూములు ఇతరుల చేతుల్లో...!
కాకినాడ జిల్లాలో 2003కి ముందు 21,253 మంది లబ్ధిదారులకు 19,563 ఎకరాలు అసైన్డ్ భూములను పంపిణీ చేసారు. వీరిలో 8468 మంది ఎస్‌సి లబ్ధిదారులకు 6,265 ఎకరాలు, 3,082 మంది ఎస్‌సటి లబ్ధిదారులకు 4,448 ఎకరాలు, 6,782 మంది బిసి లబ్ధిదారులకు 6,138 ఎకరాలు, 29 మంది మైనార్టీలకు 26 ఎకరాలు, 2,892 మంది ఒసి లబ్ధిదారులకు 2,683 ఎకరాలు అసైన్డ్ చేశారు. వీటిపై జిల్లాలో 20 మండలాల్లో 421 గ్రామాల్లో జరుపుతున్న సర్వేలో వాస్తవ సాగుదారుడు, లేదా వాళ్ళ వారసులు అనుభవిస్తున్నారా, లేకుంటే 3వ పార్టీ వారి ఆధీనంలో ఉన్నాయా..? అనే అంశాలను రెవిన్యూ సిబ్బంది ఆరా తీశారు. దాదాపు 30 శాతం భూములు వాస్తవ లబ్ధిదారులు కాకుండా ఇతరుల చేతుల్లో ఉన్నట్లు ప్రాధమికంగా గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ వివరాలు బయటకు తెలియకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.
50 శాతానికి పైనే అన్యాక్రాంతం
తాళ్ళరేవు, కరప, గండేపల్లి, పిఠాపురం వంటి ప్రాంతాల్లో 60 శాతం పైగానే భూములు పెద్దల చేతుల్లో ఉన్నాయి. రొయ్యలు, చేపలు చెరువులుగా మార్చి పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తున్న కొందరు భూస్వాములు పేదలను మభ్యపెట్టి వాటిని నేటికీ అనుభవిస్తూనే ఉన్నారు. గతంలో సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏళ్లు తరబడి అనేక పోరాటాలు చేయగా సుమారు 300 ఎకరాలు అన్యాక్రాంతమైన భూ ములను తిరిగి అధికారులు అసలు లబ్ధిదారులకు అందించారు. ఇదే మండలంలో 1977లో అసైన్ చేసిన లబ్ధిదారులకు సుమారు 50 మందికి నేటికీ పట్టాలు ఇవ్వలేదు. ముగ్గురు ఎంఎల్‌ఎలు మారినా పట్టించుకోలేదు. కరపలో ఒక రైస్ మిల్లు యజమాని 100 ఎకరాలు పైనే అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేసి రొయ్యలు చెరువులుగా మార్చి సాగు చేసుకుంటున్నారు. గండేపల్లి మండలం రామేశ్వరంపేట మెట్టపై ఉన్న 570 ఎకరాల భూములను కొన్నేళ్ళ క్రితం ప్రభుత్వం దళిత రైతులకు అసైన్డ్ చేసింది. ఆ భూములే అక్రమార్కులకు బంగారు కొండలా మారింది. వాటిపై కన్నేసిన కొందరు నామమాత్రంగా తక్కువ మొత్తంలో దళితులకు ముట్టజెప్పి, కొందరిని బెదిరించి బడా మట్టి వ్యాపారులు రూ.కోట్లలో అంతులేని సంపాదనను కూడగట్టుకొన్నారు. ఒకప్పుడు పచ్చగా కళకళలాడుతూ సుమారు 60 అడుగుల ఎత్తు ఉండే ఈ కొండ అంతా ఇప్పుడు కరిగిపోయింది. ఇలా అనేక ప్రాంతాల్లో అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి.










