
పేదలను, దళితులను ఉద్దరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాల తరబడి వారు సాగుచేసుకుంటున్న అసైన్డ్ భూములను దోచుకునేందుకు కుట్రలకు తెరలేపింది. గత ప్రభుత్వాలు అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ఇప్పటికే ఎత్తేసిన ప్రభుత్వం అక్కడక్కడా పేదలు, దళితుల చేతుల్లో ఉన్న కొద్దిపాటి అసైన్డ్ భూములపైనా కన్నేసింది. ప్రజాశక్తి - చాపాడు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 9/22 ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా 20 సంవత్సరాలుగా అసైన్డ్ భూములను సాగు చేస్తున్న వాస్తవ లబ్ధిదారులకు, వారసులకు ఆ భూమిపై పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పింది. లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాయాల్లో గ్రామాల వారీగా ప్రకటిస్తామని వెల్లడించింది. అసైన్డ్ భూముల వివరాలు, వాస్తవ లబ్ధిదారులు, ప్రస్తుతం ఎవరి సాగులో ఉంది అనే వివరాలను వెల్లడించి పాదర్శకత పాటిస్తామని ప్రకటనలు చేసింది. అయితే ఆచరణలో పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజా పోరాటాల నేపథ్యంలో దళితులు, గిరిజనులకు పాలక ప్రభు త్వాలు అసైన్డ్ భూములు కేటాయించిన విషయం విధితమే. ఈ భూములు క్రయ, విక్రయాలకు అనుమతి లేకుండా 9/77 చట్టం గత కొన్ని దశాబ్ధాలుగా రక్షణగా ఉంది. గ్రామాల్లో సాగుకోసం భూముల పత్రాలను పెద్ద రైతులు, వ్యాపారుల తనఖాకు పెట్టుకుని సాగుదారులకు అప్పులు ఇచ్చారు. ఆ ఆప్పులు తీర్చలేక అత్యధిక మంది భూమికి దూరం అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ భూములు పూర్తిగా తమ సొంతం చేసుకునేందుకు పెద్దలు పావులు కదుపుతున్నారు.
అత్యధిక భూములు పెద్దల చేతుల్లోనే..
జిల్లాలో గ్రామాల వారీగా భూముల లభ్యతను బట్టి 20 సెంట్ల నుంచి 2.50 ఎకరాల వరకూ పేదలకు అసైన్డ్ భూములను గత ప్రభుత్వాలు అందజేశాయి. 2003కి పూర్వం పంపిణీ చేసిన భూములు ప్రస్తుతం గ్రామాల్లో పెద్ద రైతులు, అగ్రకులాలు, వ్యాపారుల చేతుల్లో ఉన్నట్లు అనేక ఉదాహర ణలున్నాయి. గ్రామాల్లో అసైన్డ్ భూమి లబ్ధిదారులు తమ భూములకు పూర్తిగా దూరమయ్యారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీతో జిల్లావ్యాప్తంగా ఇటీవల సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ, అసైన్డ్, భూధాన్ తదితర భూముల జాబితా విభజన జరిగింది. ఈ జాబితాను అధికారులు వెల్లడించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.
అమలుకు నోచుకొని చట్ట సవరణ..
సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించాలని ఎపి ప్రభుత్వం తీర్మానించి చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇవే కాకుండా పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలకు సైతం ఇది వర్తిస్తుందని సవరణ చట్టంలో స్పష్టం చేసింది. కేటాయించి పదేళ్లు దాటితే ఆయా ఇళ్ల స్థలాలపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. వ్యవసాయ భూములైతే కేటాయించిన 20 ఏళ్లకు, ఇళ్ల స్థలాలైతే కేటాయించి పదేళ్లు పూర్తయిన వెంటనే వాటిపై సంబంధిత రైతులు, పేదలు, వారి వారసులకు యాజమాన్య హక్కులు లభిస్తాయని ఇందులో పేర్కొంది. ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్ కూడా సంతకం చేశారు. దీంతో అసైన్డ్ భూయజమానులకు వారి భూములపై సర్వ హక్కులు దక్కుతాయి. ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఉన్నట్లు అంచనా.
ఒంటిమిట్ట రెవెన్యూ పొలంలో సర్వే నంబర్ 2050లో పేదలు ఏడేళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. పెండ్లిమర్రి మండలం పెద్దశెట్టిపల్లె రెవెన్యూపొలం సర్వే నంబర్ 330లో యల్లటురు , పెండ్లిమర్రి ప్రాంతాల ఎస్‌సి, ఎస్‌టిలు రూ. 4లక్షలు ఖర్చుచేసి భూములను సాగులోకి తెచ్చుకున్నారు. అటువంటి భూములకు పట్టాలు మంజూరు చేయటంలో నిర్లక్షం వహిస్తున్నారు. కాశినాయన మండల పరిధిలోని గ్రామాలకు చెందిన అసైన్డ్ భూములను విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు చెందిన భూస్వాములు వందలాది ఎకరాలు అక్రమంగా అనుభవిస్తున్నారు. బ్రహ్మంగారిమఠం మండలం గొడ్లవీడులో ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి 15.50 ఎకరాలిచ్చేందుకు వీలుగా జాబితాలో చోటిచ్చారు. రేకలకుంటలో మత్స్యకారుల ఆధార్ కార్డులను సేకరించి, వారి పేరుతో స్థానిక నేతలు పట్టాలు సిద్ధం చేయించారు. భూములను కేటాయించిన తర్వాత స్థానిక నేతలు తమ అధీనంలో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి ఆ పేదలకు ఇచ్చి యాజమాన్యపు హక్కులు కల్పిస్తుందా? బినామీ పేర్లతో అనుభవిస్తున్న ఆ భూస్వాములకే కట్టబెడతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు..
సాగులో ఉన్న పేదల భూములకు పట్టాలు ఇవ్వాలని జిల్లా భూపోరాట సాదన కమిటీ డిమాండ్ చేస్తూ పోరాటాలు సాగిస్తున్నది. జిల్లాలో ఒంటిమిట్ట, పెండ్లిమర్రి, బద్వేల్, అట్లూరు, కోడూరు, కలసపాడు, బిమఠం, వీరపునాయని పల్లె, తదితర మండలంలోని దళితులు పేదలు సాగులో ఉన్నటు వంటిభూములకు అసైన్డ్ మెంట్ కమిటీలో పట్టాలు మంజురుచేయాలని పోరాటం సాగిస్తున్నారు. అందులో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్‌డిఒ కార్యాలయాల ముందు భూములు సాగులో ఉన్నలబ్ధిదారులతో కలిసిధర్నాలు నిర్వహించారు. స్థానిక పేదలకు సెంటు భూమి అసైన్డ్ మెంట్ కమిటీలో ఇవ్వలేదని స్థానిక ఎమ్మెల్యేల అనుచరులకు, అనర్హులకు ప్రభుత్వ భూములను అప్పజెప్పారని ఆరోపించారు. ఇప్పటికే అన్యాక్రాంతం అయిన భూములను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులకు అనేకదపాలుగా ఆందోళనరూపంలో వినతిపత్రాలు ఇచ్చిన అధికారులు వాటిని విస్మరించారు. ఎళ్లతరబడి పేదలు సాగులో ఉన్నప్పటికీ అసైన్‌మెంట్‌లో పట్టాలు మంజురుచేయటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం అసైన్డ్ మెంట్ కమిటీలో స్థానిక దళితులు, పేదలకు పట్టాలు మంజురుచేయాలని కోరుతున్నారు.