పెద్దిరెడ్డి కుటుంబంపై విమర్శలు తగవు
ప్రజాశక్తి-పీలేరు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి విమర్శలు చేయడం తగదని ఎపిఎండిసి డైరెక్టర్ సి.హరీష్‌రెడ్డి అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిషోర్ తన వ్యక్తిగత ప్రచారం కోసమో లేక ఉనికిని కాపాడుకోవడం కోసమో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. కిషోర్ చెప్పినట్లుగా చిన్న వయసులోనే ఓటరుగా నమోదు చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఓటరు నమోదుకు ఆధార్ కార్డు తప్పనిసరి అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ఆయన ఆరోపణలు చేయడం అతని అవగాహన రాహిత్యానికి ఓ నిదర్శనమని పేర్కొన్నారు. వైసిపి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరూ ఓటర్ల నమోదుకు ప్రయత్నించలేదని చెప్పారు. కలికిరి మండలంలోని నగిరిపల్లి పంచాయతీలోనే 210 డబుల్ ఎంట్రీ ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. సమావేశంలో జడ్‌పిటిసి ఏటి రత్నశేఖర్‌రెడ్డి, సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ బాష, వైస్ ఎంపిపిలు హరిత వెంకటరమణ, వెంకటాచలపతి, ఎఎంసి చైర్మన్ ఎల్లయ్య, మండల పార్టీ కన్వీనర్ దండు జగన్మోహన్‌రెడ్డి, మాజీ కన్వీనర్ నారే వెంకటరమణారెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి హుమయూన్, అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షులు మహిత ఆనంద్, సాంస్కతిక పర్యాటక శాఖ జిల్లా బోర్డు సభ్యులు షేక్ షాకీర్ బాష, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.










