Jul 10,2023 21:21

సాగునీటిని విడుదల చేస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి - పాచిపెంట : పాచిపెంట సమీపాన గల పెద్దగడ్డ రిజర్వాయర్‌ ప్రధాన కుడికాలువ నీటిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సోమవారం విడుదల చేశారు. 2023 ఖరీఫ్‌ పంటకు వివిధ ప్రాజెక్టుల నుంచి సాగు నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దగెడ్డ నుండి నీటిని విడుదల చేశారు. పెద్దగెడ్డ జలాశయం కుడి ప్రధాన కాలువ ద్వారా పాచిపెంట మండలంలోని 7 గ్రామాలకు చెందిన 4,550 ఎకరాల ఖరీఫ్‌ పంటలకు, రామభద్రపురం మండలంలోని 7 గ్రామాలకు చెందిన 3,013 ఎకరాలకు నీరు సరఫరా చేశారు. జలాశయం రివర్‌ స్లూయిసు కర్రివలస ఆనకట్ట రెండు కాలువల ద్వారా పాచిపెంట మండలంలోని 8 గ్రామాలకు చెందిన 1,768 ఎకరాలకు, సాలూరు మండలంలోని 7 గ్రామలకు చెందిన 2,826 ఎకరాలకు, రామభద్రపురం మండలంలోని ఒక గ్రామానికి చెందిన 63 ఎకరాలకు వెరసి 12,220 ఎకరాల ఆయకట్టుకు నీరు సరఫరా చేయడం జరుగుతోంది. పెద్దగెడ్డ ప్రాజెక్టు ఆధునికీకరణను రూ.28.18 కోట్లు జైకా నిధులతో పనులు ప్రారంభించి, కర్రివలస ఆనకట్ట వద్ద అప్రాను కాంక్రీటు పనులు, పెద్దగెడ్డ కుడి ప్రధాన కాలువ లైనింగు పనులను దాదాపు 2.50 కిలోమీటర్లు పూర్తి చేశారు. ప్రస్తుతం జలాశయంలో 0.740 టిఎంసి నీటి లభ్యత ఉంది. ఈ ఖరీప్‌ సీజన్‌ 2023కు ముందుగా చివరి ఆయకట్టు పరిధిలో గల చెరువులు నింపటం కొరకు పెద్దగెడ్డ కుడి ప్రధాన కాలువ, కర్రివలస ఆనకట్ట కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ రైతులకు సకాలంలో సాగు నీటిని అందించేందుకు ప్రణాళికాబద్ధంగా నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రైతుల శ్రేయస్సుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుం దని చెప్పారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని ఆయన ఆకాక్షించారు. కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినవెంకట అప్పలనాయుడు, ఎంపిపి బి.ప్రమీల, వైసిపి నాయకులు పి.చినబాబు, డోల బాబ్జీ, జి.ముత్యాలనాయుడు, టి.గౌరీశ్వరరావు, సర్పంచ్‌ ఇజ్జాడ అప్పలనాయుడు, ఎంపిటిసిసభ్యులు దండి ఏడుకొండ, పలువురు నాయకులు, జలవనరుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లస్కర్ల గౌరవేతనానికై వినతి
గత మూడేళ్లకు పైగా గౌరవ వేతన బకాయిలు రావాల్సి ఉందని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొరకు పెద్దగెడ్డ లస్కర్లు లిఖితపూర్వకంగా వినతి పత్రాన్ని అందజేశారు. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు బకాయిలు ఇవ్వలేదని పేర్కొన్నారు. సకాలంలో గౌరవ వేతనం అందకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. లస్కర్లు, హెల్పర్లు, వాచ్‌మెన్లు, ఆపరేటర్‌తో పాటు 22 మంది ఉద్యోగులుగా పనిచేస్తున్నామని బకాయిలు అందేలా చూడాలని కోరారు. స్పందించిన రాజన్నదొర సిఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.