కార్లు, బైక్‌ల పేరిట భారీ ఆఫర్లు
బరులు చదును చేస్తున్న పందెంరాయుళ్లు
పోలీసుల హెచ్చరికలు బేఖాతరు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
గతంకంటే భిన్నంగా కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. బరులను చదును చేసే ఏర్పాట్లలో నిమగమయ్యారు. కోడిపందేలను అడ్డుకుంటామంటూ పోలీసుల హెచ్చరికలు ఏటా మాదిరిగానే ఈసారీ కొనసాగుతున్నా పందెంరాయుళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కోర్టుకు చెప్పుకునేందుకే బైండోవర్ కేసులు, పలుచోట్ల బరుల ధ్వంసం ఫొటోలు వంటివి పోలీసులు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. భోగి రోజు ఉదయం నుంచి పందేలు ప్రారంభం కానున్నట్లు పందెంరాయుళ్లు ధీమాగా చెబుతున్నారు. ఈసారి జోడి పందేల నిర్వహణ పేరుతో భారీ పందేలకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఎక్కువ పందేలు గెలిచిన వారికి బహుమతిగా కారు, బైక్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో భీమవరం సమీపంలోని పెన్నాడలో జోడి పందేలు గెలిచిన వారికి బైక్ ఇచ్చినట్లు పెద్దఎత్తున చెప్పుకున్నారు. ఈసారి ఆకివీడు, కాళ్ల,, కైకలూరు మండలాలతోపాటు పలుచోట్ల బహుమతుల కింద కార్లు, బైక్‌లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జోడిపందేల కింద ఐదు పందేలు నిర్వహిస్తే మూడు పందేలు గెలిచిన వారికి ఈ బహుమతులు ఇస్తారు. ఒకవేళ మూడు పందేలు నిర్వహిస్తే రెండు పందేలు గెలిచిన వారికి బహుమతులు అందజేస్తారు. బహుమతిగా కారు పెట్టినచోట తొమ్మిది పందేలు నిర్వహించి ఐదు పందేలు గెలిచిన వారికి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. పందెంరాయుళ్లను ఆకర్షించేందుకు జోడి పందేలపై విపరీతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో జోడి పందేల్లో బెట్టింగ్ కింద ప్రతి పందేనికి రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకూ కొనసాగనున్నట్లు చెబుతున్నారు. జోడి పందేల్లో పాల్గొనే వారు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చిన పుంజులను పందేల్లో దింపేందుకు సిద్ధమవుతున్నారు. దెందులూరు, పెదవేగి, జంగారెడ్డిగూడెం, ఏలూరు వంటి పలుచోట్ల సైతం పెద్దఎత్తున పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పందేల ఏర్పాట్లు స్థానిక ఎంఎల్‌ఎల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ పందేలు నిర్వహించాలి.. ఎవరికింత మామూళ్లు ఇవ్వాలో సైతం ప్రజాప్రతినిధులే నిర్ణయిస్తున్నట్లు చెబుతున్నారు. పందేలను అంతా తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిడమర్రు మండలం మందలపర్రులో భారీ పందేలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే గ్రామంలో ప్రధాన రహదారికి పక్కగా పెద్దఎత్తున పందేలు నిర్వహించినా అడ్డుకున్న నాధుడే లేడు. గడిచిన రెండేళ్లుగా కోవిడ్ నేపథ్యంలో పందేల్లో పాల్గొనేందుకు కొంత జంకేవారు. ఈసారి అటువంటి పరిస్థితి లేకపోవడంతో జనాన్ని పెద్దఎత్తున పందేలకు ఆకర్షితులను చేసేందుకు బరుల నిర్వాహకులు బహుమతుల పేరుతో వల వేస్తున్నట్లు తెలుస్తోంది.
కాళ్ల: పందెం కోడి కాలు దువ్వుతోంది. లక్షలు చేతులు మార్చుకోవడానికి పందెంరాయుళ్లు సన్నద్ధమయ్యారు. మండలంలో పలు గ్రామాల్లో భారీస్థాయిలో కోడిపందేలకు రంగం సిద్ధమైంది. సీసలిలో ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు పొలంలో కోడి పందేల బరిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మండలంలో జువ్వలపాలెం, కాళ్లకూరు, కాళ్ల, జక్కరం, పెదఅమిరం, సీసలి గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు కోడిపందేల బరులను సిద్ధం చేస్తున్నారు.
సీసలిలో ఫ్లడ్ లైట్లు సైతం ఏర్పాటు
సీసలిలో పదెకరాల పొలంలో బరిని సిద్ధం చేసి పెద్ద పందేలు వేసే చోట భారీ క్లాత్ టెంట్ ఏర్పాటు చేశారు. బరి చుట్టూ అల్యూమినియం మెస్ ఏర్పాటు చేశారు. బరిలోకి వచ్చి వెళ్లేందుకు రెండు మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి సమయాల్లోనూ పందేలు కొనసాగించేందుకు ఫ్లడ్‌లైట్లు, గ్యాలరీలు సైతం ఏర్పాటు చేస్తుండటం విశేషం.
పెనుమంట్ర: కోడి పందేల నిర్వహణకు బరులు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ముఖ్యంగా నత్తారామేశ్వరం, గరువు, ఆలమూరు, మార్టేరు పరిధిలో పందేల నిర్వహణకు ఆయా గ్రామాల్లో అధికార పార్టీ నేతలు, పెద్దల అండదండలతో బరుల ఏర్పాట్లు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. ఈ బరుల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్ల వేలం పాట కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం.










