Jan 25,2023 23:48

పరిశీలిస్తున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి-మాడుగుల:గిరిజన గ్రామాలకు సాగు నీరు అందించే పెద్దేరు ఎడమ కాలువ పనులు తక్షణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి వెంకన్న, గిరిజన సంఘం 5వ షెడ్యూల్‌ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భవాని డిమాండ్‌ చేశారు. బుదవారం ఎడమ కాలువ గ్రామాల్లో పర్యటించిన వారు మాట్లాడుతూ, జలాశయంకు కూత వేటు దూరంలో ఉన్న కామకోటం, ఎల్‌.గవరవరం, ఒండ్రు వీధి, కృష్ణా పురం, గదభ వీధి, కొండల పాడూ తదితర గ్రామాలకు చెందిన 1500 ఎకరాలు ఎడమ కాలువ ద్వారా సాగు అవుతాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు అయినా పనులు పూర్తి కాలేదన్నారు ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఎన్నికల ప్రచార సమయంలో ఎడమ కాలువ నిర్మాణం కోసం హామీ ఇచ్చారని, ఇప్పటి అమలు చేయలేదని తెలిపారు. ఈ సమస్య పై గిరిజనులు పలు దఫాలుగా ఆందోళనకు దిగడంతో విశ్రాంత చీఫ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణ సర్వే జరిపి గత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో నిధులు మంజూరైనా పనులు పూర్తి కాలేదని చెప్పారు. ఇప్పటికైనా కాలువ నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.