Aug 01,2023 00:18

టిడిపి కార్యాలయం వద్ద ఎంఎల్‌ఎ చినరాజప్పను అడ్డుకుంటున్న పోలీసులు

అవినీతి ఆరోపణలపై రాజప్ప, దొరబాబు లైడిటెక్టర్‌ సవాల్‌
వైసిపి, టిడిపి పార్టీల కార్యాలయాల వద్ద మొహరించిన పోలీసులు
వెనక్కి తగ్గిన రాజకీయ నేతలు
ప్రజాశక్తి - పెద్దాపురం
కొన్ని రోజులుగా పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రామేశం మెట్ట అక్రమ తవ్వకాలు, నియోజకవర్గ పరిధిలో అక్రమ మైనింగ్‌, చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలపై ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరువురు లైడిక్టెర్‌ సవాలకు సైతం సై అంటే సై అన్నారు. సోమవారం మున్సిపల్‌ సెంటర్‌లో లై డిటెక్టర్‌ సవాల్‌కు ఇరువురూ తన అనుచరులతో సిద్ధమయ్యారు. దీంతో పెద్దాపురంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ముందు జాగ్రత్తగా సిఐ షేక్‌ అబ్దుల్‌ నబీ, ఎస్‌ఐ వి.సురేష్‌ ఆధ్వర్యంలో సామర్లకోట, పెద్దాపురం పోలీసులు రంగంలోకి దిగారు. టిడిపి, వైసిపి పార్టీల కార్యాలయాల వద్ద మోహరించారు. కార్యకర్తలను, నాయకులను పార్టీ కార్యాలయాల నుంచి మున్సిపల్‌ సెంటర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కార్యాలయాల వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున నినదించారు. వారివారి కార్యాలయాల వద్ద చినరాజప్ప, దవులూరి దొరబాబులు మాట్లాడారు. ఇరువురికీ పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించారు. ఇరువురు నాయకులు వెనక్కి తగ్గారు దీంతో ఉత్కంఠకు తెరదిగింది. అనంతరం ఇద్దరు నాయకులూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఈ వివాదానికి తాత్కాలికంగా ముగింపు పలికారా, లేదా మళ్లీ రాజుకుంటుందా అనే చర్చ సర్వత్రా సాగుతోంది.