- మున్సిపల్ ప్రజాప్రతినిధులకు సిపిఎం వినతిపత్రం
ప్రజాశక్తి - పెద్దాపురం
పెద్దాపురం పట్టణంలో 30 పడకలుగా ఉన్న ఏరియా ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డు తులసీమంగ తాయారు, వైస్ చైర్మన్‌లు నెక్కంటి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మి,వార్డు కౌన్సిలర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడుతూ గతంలో టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు పెద్దాపురం ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివద్ధి చేస్తామని రెండు దశాబ్దాలుగా హామీ ఇస్తూనే ఉన్నాయన్నారు. ఏరియా ప్రభుత్వా సుపత్రిగా పేరు మార్చారు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. పెరుగుతున్న జనాభాను దృష్ట్యా ఈ ఆసుపత్రిపై పెద్దాపురం పట్టణ ప్రజలే కాకుండా సమీప మండలాల్లో ఉన్న గ్రామాల నుంచి ప్రతిరోజు 500 మంది వరకు రోగులు ఈ ఆసుపత్రికి వస్తున్నార న్నారు. డాక్టర్ల కొరత, కొత్త భవనానికి కరెంటు నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో మరమ్మతులు సకాలంలో చేయక తరచూ రోగులు విద్యుత్ సమస్యతో అవస్థలు పడుతున్నారన్నారు. ఆరోగ్య శాఖా మంత్రి మాట్లాడుతూ పెద్దాపురం ప్రభుత్వాసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగానే నిర్వహిస్తామనిశాసన సభలో ప్రకటించడం అన్యాయమన్నారు. మున్సిపల్ కౌన్సిల్ 100 పడకల ఆసుపత్రిగా పెద్దాపురం ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని కోరుతూ కౌన్సిల్లో తీర్మానించి తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిరపరపు శ్రీనివాస్, గడిగట్ల సత్తిబాబు, డి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చైర్‌పర్సన్ తులసి మంగతాయారుకు వినతి పత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు










