ప్రజాశక్తి-ఆదోనిరూరల్
30 ఏళ్లుగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న పాండవగల్ పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.వెంకటేశులు డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో 26, 27, 28న గ్రామస్తులు చేపట్టే రిలే నిరాహార దీక్షలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కె.వెంకటేశులు, సిపిఎం మండల కార్యదర్శి కె.లింగన్న మాట్లాడారు. కోర్టులో ఉందనే పేరుతో ప్రభుత్వం పెద్ద చెరువు సమస్యను నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు. గత 30 ఏళ్లుగా చెరువు సమస్య పరిష్కారం కోసం సిపిఎం పోరాడుతూనే ఉందని చెప్పారు. పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సబ్ కోర్టు, జిల్లా స్థాయి కోర్టు, హైకోర్టులో కూడా ప్రభుత్వ చెరువు అని తీర్పులు వెలువడినప్పటికీ స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఆక్రమణదారు విజయలక్ష్మి అప్పీల్‌కు వెళ్లారని చెప్పారు. ఇప్పటికే ఎన్నో కేసులు కూడా గ్రామస్తులు భరించారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చెరువు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షలో సిపిఎం మండల కమిటీ సభ్యులు జె.రామాంజనేయులు, సిపిఎం శాఖ కార్యదర్శులు గోవిందు, హనీఫ్ బాషా, సిపిఎం శాఖ సభ్యులు కె.నర్సిరెడ్డి, డిజె.నర్సిరెడ్డి, కె.హనుమంతు రెడ్డి, యు.హనుమంతు రెడ్డి, వై.తాయన్న, యు.తాయప్ప, ఎస్.షేక్షావలీ కూర్చున్నారు. ఈ దీక్షలకు సిపిఎం మండల నాయకులు హనుమంతురెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షులు శేఖర్, సిపిఎం నాయకులు వెంకటేష్, ఆటో యూనియన్ (సిఐటియు) నాయకులు వీరేష్, ఉరుకుందు, డివైఎఫ్‌ఐ మండల అధ్యక్షులు శ్రీకృష్ణ, ఉపాధ్యక్షులు చిరంజీవి, రమేష్ మద్దతు తెలిపారు. సిపిఎం శాఖ కార్యదర్శి పాండురంగ, శాఖ సభ్యులు కృష్ణ, బాష, గ్రామస్తులు పాల్గొన్నారు.
దీక్షలను ప్రారంభించి మాట్లాడుతున్న వెంకటేశులు










