
- కెసి కెనాల్ ఆయకట్టులో పడని నాట్లు శ్రీ రైతుల ఆశలు ఆవిరి
ప్రజాశక్తి- కడప ప్రతినిధి : సాగు నీరు విడుదల కాకపోవడం, తీవ్ర వర్షాభావం, అధికారుల ప్రకటనతో కడప జిల్లా పరిధిలోని కర్నూలు-కడప కెనాల్ (కెసి) ఆయకట్టు పరిధిలోని వరి రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ ఖరీఫ్‌లో ఒక్క ఎకరంలోనూ వరి సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సెప్టెంబర్ మూడవ పూర్తి కావస్తున్నా శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరగకపోవడం, కర్ణాటకలో తుంగభద్ర కెనాల్‌కు గండి పడడంతో ఆయకట్టు భూముల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ఆగస్టు 16న సాగు నీరు విడుదల కావాల్సి ఉంది. నారుమడులు వేసుకొని సాగుకు సిద్ధంగా ఉన్న రైతులు నీరు విడుదల కాదని తెలిసి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 91 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. దీంతో, ఈ ఖరీఫ్‌లో వరికి సాగు నీరు ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేశారు. నీటి వనరులున్న చోట్ల ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని సూచించారు. కెసి కెనాల్ పరిధిలో కడప, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. ఇందులో కడప జిల్లాలో 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దాదాపు 65 వేల నుంచి 80 వేల ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి సాగు చేస్తుంటారు. గత ఏడాది ఈ సమయానికి 62 వేల ఎకరాల్లో వరి సాగులో ఉంది. రైతులు ప్రస్తుతం ఆరు వేల ఎకరాలకు సరిపడగా వరి నారు మడులు వేశారు. సాగు నీరులేక ఒక్క ఎకరంలోనూ వరి నాట్లు వేయలేదు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో అధికారులు ఈ నెల 15న చేసిన ప్రకటనతో వరి సాగుపై రైతులు ఆశలు వదులుకున్నారు. వరికి సాగు నీరు ఇచ్చేది లేదని అధికారులు చెప్పడమే కాకుండా సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు మాత్రమే పండించుకోవాలని సూచించారు. అయితే, ఇందుకు సంబంధించిన విత్తనాలు ఆర్‌బికెల్లో అందుబాటులో లేవని రైతులు చెప్తున్నారు. కెసి ఆయకట్టు శివారు ప్రాంతాల్లో ఖరీఫ్‌లో పసుపు, మిరప, కూరగాయల పంటలు కూడా పండిస్తుంటారు. గత ఏడాది మూడు వేల ఎకరాల్లో పసుపు సాగైంది. ఈ ఏడాది ప్రస్తుతం 1,600 ఎకరాల్లో మాత్రమే ఈ పంట సాగులో ఉంది. ప్రస్తుతం పసుపు సాగుకు కూడా సమయం మించిపోవడంతో కూరగాయల పంటలు సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి నాయక్ సూచించారు. దీంతో, ఖరీఫ్‌లో సాగు విరమించి రబీలోనే పంటలు సాగు చేసే ఉద్దేశంతో ఉన్నామని ఆయకట్టు రైతులు కొందరు 'ప్రజాశక్తి'కి తెలిపారు.
- విత్తన పంపిణీకి అనుమతి రావాలి
కెసి ఆయకట్టు పరిధిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాల పంపిణీ కోసం అనుమతి రావాల్సి ఉంది. ఈలోపు ఆర్‌బికెల వారీగా విత్తన పొజిషనింగ్ చేసే పనిలో వ్యవసాయ శాఖ నిమగమైంది.
- అయితా నాగేశ్వరరావు, డిఎఒ, కడప
- వరి నాట్లు వేయలేకపోయాను
కెసి కెనాల్‌కు సకాలంలో నీరు వస్తుందని ఆశించి వరి నారు వేశాను. కాలువకు నీరు విడుదల కాకపోవడంతో నాట్లు వేయడానికి అవకాశం లేకుండా పోయింది. నారు ముదిరిపోయింది. ప్రభుత్వం ఆరుతడి పంటల సాగుకు నీటిని విడుదల చేసి విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలి.
-ప్రసాద్, సిద్ధారెడ్డిపల్లి గ్రామ రైతు