పార్వతీపురంరూరల్: తెలుగువారికే సొంతమైన పౌరాణిక పద్యనాటకాలను పరిరక్షించుకోవాలని జాయింట్ ఆర్.గోవిందరావు అన్నారు. ఆదివారం స్థానిక లయిన్స్ కల్యాణమండపంలో ఉత్తరాంద్ర కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్యర్యంలో శ్రీవాణీ, శివాని సంఘం అధ్యక్షలు బడే శ్రీరాములు ఆధ్యర్యంలో నిర్వహించిన పౌరాణిక పద్యనాటక పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ దేశంలో ఎన్ని భాషలున్నప్పటికీ తెలుగుపద్యం ప్రక్రియ ప్రత్యేకతే వేరని అన్నారు. మారుతున్న కాలం, ప్రజల అభీష్టాలకు అనుగుణంగా పౌరాణిక నాటకాలకు ఆదరణ తగ్గుతున్నప్పటికీ ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్న సంస్ధలకు చెందిన వారి వల్లే ఇంకా రాష్ట్రంలో పౌరాణిక నాటకం బతికి ఉందని అన్నారు. విరివిగా ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. పౌరాణిక నాటకాలను ప్రోత్సాహించాలనే ఉద్ధేశ్యంగా ప్రభుత్వం నంది నాటకపోటీలకు సన్నద్ధమౌతున్నట్లు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ కళాకారుడు రాజాంకు చెందిన నక్షత్రక పాత్రధారి యడ్ల గోపాలరావుకు కేంద్రప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించిన నేపథ్యంలో ఆయనకు నిర్వాహుకులు కిలో వెండి కిరీటాన్ని జెసి చేతులు మీదు అందజేసి, శాలువాతో సత్కరించారు.
ప్రేక్షకులను కట్టేపడేసిన పద్యపరిమళాలు
ఈ పోటీలు సందర్భంగా కెల్ల గ్రామానికి చెందిన గుంటెడ్డి బలరాంస్వామి, రాజాంకు చెందిన అమరాపు కృష్ణమూర్తి గయోపాఖ్యానంలో కృష్ణుడు, అర్జునుడు పాత్రల్లో ఆలపించిన పద్యాలు సభికులను కట్టిపడేశాయి. శ్రీరామాంజనేయ యుద్ధంలో శ్రీరాముడుగా కొమరాడకు చెందిన గులిపల్లి చినతిరుపతిరావు, ఆంజనేయుడుగా అలుగోలు శంకరరావు రాగయుక్తంగా ఆలపించిన పద్యాలు రంజింపజేశాయి. పార్వతీపురంకు చెందిన పట్నాల నరసింహాచారి హరిశ్చంద్రుడుగా, వీరఘట్టంకు చెందిన చింతాడ గోవిందమ్మ చంద్రమతిగా శ్రోతలను ఎంతగానో అలరించారు. మోహినీ భస్మాసుర నాటకంలో భస్మాసుర పాత్రధారి మగ్గూరుకు చెందిన వంగపండు కృష్ణ, శ్రీకాకుళంకు చెందిన మోహిని పాత్రధారి దుర్గాకల్యాణి, శివుడుగా రుషింగికి చెందిన శివాల అప్పలనాయుడు పద్యాలు మైమరిపించాయి. ఈ అర్ధరాత్రి వరకూ కొనసాగే ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు, నగదు బహుమతులను అందచేస్తామని నిర్వాహకులు అమరాపు రామకృష్ణ తెలిపారు.










