Dec 23,2021 06:57

తాను ఏది మాట్లాడినా న్యాయ సూత్రాల కోసం ప్రజాస్వామిక హక్కుల కోసం తప్ప పదవుల కోసం రాజకీయాల కోసం కాదని జై భీమ్‌ కె.చంద్రు స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలో భాగమైన తాను కొన్ని విషయాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు నచ్చనంత మాత్రాన అభాండాలు వేయడం సరికాదంటున్న చంద్రుతో
తెలకపల్లి రవి జరిపిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో కొన్ని భాగాలు....

జస్టిస్‌ చంద్రు, ముందుగా మా అభినందనలు అందుకోండి. ఈ రోజు మీరు న్యాయం కోసం పోరాడటంలో భీముడుగా వున్నారు. ఇప్పుడు ప్రతి చోటా లాల్‌ నీల్‌ అంటున్న మాట మీరు దశాబ్దాల కిందటే జయప్రదంగా ఆచరణలో పెట్టినట్టున్నారు కదా?
పాఠశాల విద్యార్థిగా నేను రాజకీయాల పట్ల, ఉద్యమాల పట్ల ఆసక్తి పెంచుకున్నాను. కాలేజీ రోజుల్ల్లో ఎస్‌.ఎఫ్‌.ఐ విద్యార్థి నాయకుడుగా వున్నాను. ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమంతోనూ వున్నాను. వామపక్ష రాజకీయాలతో నాకు యాభై ఏళ్ల పైబడి సంబంధం వుంది. అది సమాజాన్ని ప్రజలను రాజకీయాలను అర్ధం చేసుకోవడానికి చాలా ఉపయోగపడింది. ఇప్పుడు నేను పార్టీలో లేకున్నా ఆ ప్రభావం, అనుభవం నాకు వృత్తి లోనూ జడ్జిగా పనిచేయడంలో బాగా ఉపయోగపడ్డాయి. ఆ శాస్త్రీయ అవగాహనను నేను కొనసాగిస్తాను. ఆర్థిక వ్యవస్థే న్యాయంతో పాటు అన్నిటినీ నిర్ణయిస్తుంది. ఇ.ఎం.ఎస్‌ నంబూద్రిపాద్‌పై నడిచిన ప్రసిద్ధ కోర్టు ధిక్కార కేసులో విన్న ఆ మాట నేనెప్పుడూ ఉటంకిస్తాను.
మీ స్వంత రాష్ట్రం లోనే జయలలిత అనేక కేసుల మధ్య అధికారంలో కొనసాగారుగాని ఆమె రెండు లక్షల మంది ఉద్యోగులను ఒక్క కలం పోటుతో తొలగిస్తే కోర్టు సమర్థించింది కదా..
ఔను. అది తమిళనాడు చరిత్ర లోనే దుర్దినం. దురదృష్టవశాత్తూ మద్రాసు హైకోర్టు ఉద్యోగుల పిటిషన్‌ను తిరస్కరించింది. సుప్రీం కోర్టులో ఎవరూ కేసు వేయకపోతే సిపిఎం ఎం.పి రంగరాజన్‌ వేశారు. అయితే ఆయనకు ఆ కేసుతో సంబంధం (లోకస్‌ స్టాండీ) లేదని తిరస్కరించారు. తమిళనాడులో భయోత్పాత పరిస్థితి వల్ల ఎవరూ కేసు వేసే పరిస్థితి లేదని మేము వాదించాము. సుప్రీం కోర్టు ముగ్గురితో కమిటీ వేసింది గాని సమ్మె చేయడం ప్రాథమిక హక్కు కాదని వారు తేల్చారు.
నంబూద్రిపాద్‌పై కోర్టు ధిక్కారం కేసు చెప్పారు. ఈ మధ్య ఎ.పి హైకోర్టు జడ్జి ఒకరు మీపై కోర్టు ధిక్కారం అంటూ మీ వయసు, సేవ కారణంగా ఆ పని చేయడం లేదని వ్యాఖ్యానించారు.
నాకు ఆ వివరాలన్నీ తెలియవు. పత్రిక లోనే చదివాను. అయితే ఆ విధమైన కేసుకు వెళ్లకపోవడం సరైందే. నేనూ న్యాయ వ్యవస్థలో భాగంగా వున్నవాణ్నే. కోర్టులను కించపర్చే ఉద్దేశం నాకు లేదు. అయితే న్యాయ వ్యవస్థలో పొరబాట్లు జరిగితే ఎత్తిచూపవలసిన బాధ్యత నాపై వుంటుంది. ప్రజలు ఉపశమనం కోసం వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ న్యాయేతరమైన వారిలా ప్రవర్తించకూడదు. వారు ఏం చేసినా హేతుబద్దంగా చట్టబద్దంగా వుండాలి. న్యాయ వ్యవస్థకు పార్టీలతో సంబంధం వుండదు. శత్రువులు అంటూ వుండరు. ఎక్స్‌, వై, జెడ్‌ ఎవరు వచ్చినా ఒకేలా వ్యవహరించాలి. కాబట్టి నా పని నేను చేశాను. నా గత కృషిని బట్టి నా మీద ఎలాంటి చర్య తీసుకోనందుకు ధన్యవాదాలు.
రికార్డు స్ఘాయిలో 96 వేల కేసులు పరిష్కరించిన వ్యక్తిగా మీరు ఏదైనా న్యాయంగా విచక్షణతో మాట్లాడారని ఎవరైనా అనుకుంటారు. అయితే కొందరు దీనిపై రకరకాల వ్యాఖ్యలు చేశారు. మీరు పదవుల కోసం ఇదంతా చేశారంటున్నారు. ఈ ప్రశ్న అడగడం వివాదం కోసం కాదు. విస్పష్టత కోసం. అసలు జగన్‌ ప్రభుత్వం నుంచి ఎవరైనా కలిశారా?
మీరు ఒక విమర్శ చేసినపుడు ప్రతివిమర్శ రావడం సహజం. అయితే విమర్శ ఆరోగ్యకరంగా వుండాలి. ఈ రోజు సోషల్‌ మీడిjలో ఏదైనా అనొచ్చు. పత్రికలు ఎలక్ట్రానిక్‌ మీడియాకు సంబంధించి వున్న పద్ధతులు, సంప్రదాయాలు దానికేమీ లేవు. మీరు నచ్చకపోతే ఏదైనా అనేస్తారు. నేను తొమ్మిదేళ్ల కిందట పదవీ విరమణ చేశాను. ఇన్నేళ్లలో ఏ పదవీ తీసుకోలేదు. కేసులు వాదించలేదు. సమాజ సేవ చేస్తున్నాను, చేస్తాను. కాబట్టి నేనేదో పదవుల కోసం మాట్లాడాననడం అర్థంలేని పని. ఏ పదవి తీసుకోరాదనే సూత్రం పెట్టుకున్నాను. అయితే వీటన్నిటికీ జవాబులివ్వడం వృథా వ్యవహారం. నాకు...జయలలిత, కరుణానిధి ఇవ్వలేని పదవులు జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవ్వగలరా?
దీర్ఘకాల అనుభవం గల ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాజ్యాంగం మూడవ భాగం ప్రకారం నేను దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు. కేంద్ర రాష్ట్రాలకు, రాజకీయాలకు సంబంధించి దేనిపైనైనా మాట్లాడవచ్చు. రాజ్యాంగ పరమైన ఏదైనా విషయమై న్యాయమూర్తిగా అభిప్రాయం చెప్పవచ్చు. అది ఒకరికి నచ్చితే మరొకరికి మింగుడు పడకపోవచ్చు. అంతమాత్రాన మమ్ముల్ను వివాదంలోకి లాగడమేమిటి? అభిప్రాయం చెప్పినపుడు నచ్చితే తీసుకోవాలి లేదంటే విమర్శించాలి. అంతేగాని నాకు ఉద్దేశాలు ఆపాదించడం, పదవుల కోసం మాట్లాడుతున్నానని ఆరోపించడం సరికాదు. నాకెందుకు పదవులు? నేను సమాజం కోసం పని చేస్తున్నాను. ఈ సినిమా కూడా గతంలో ఒక కేసులో నేను చేసిన కృషిని చూపిస్తుంది. న్యాయవాద వృత్తికి గౌరవం తీసుకురావడం, కోర్టుకు, బాధ్యత గల పోలీసులకు గౌరవం కల్పించడానికి సంబంధించింది. అందుకే ఇప్పటికీ అది మంచిదని వాస్తవికమైనదని ప్రజలు భావించారు. నేను ఎలా పని చేశానో ఆ చిత్రమే చెబుతుంది. 30 ఏళ్లు న్యాయవాదిగా ఏడేళ్లు జడ్జిగా చేసిన కృషికి మసి పూసే ప్రయత్నం చెల్లుబాటు కాదు. ఇవన్నీ తాత్కాలికమైనవి. మంచి మాత్రమే నిలబడుతుంది. చెడు కొట్టుకుపోతుంది.
ఎ.పిలో రాజకీయ న్యాయ యుద్ధాలనూ జాతీయంగానూ న్యాయ వ్యవస్థలో ధోరణులపై విమర్శను ఎలా చూస్తారు?
ప్రభుత్వం తీసుకునే ప్రతిచర్య రాజకీయమైందే. రాజ్యాంగం కూడా రాజకీయ పత్రమే. ఒకప్పుడు బ్యాంకుల జాతీయీకరణను రాజభరణాల రద్దును కోర్టులు కొట్టివేశాయి. ఇవి సంపన్నులు భూస్వాముల కోర్టులని విమర్శ వచ్చింది. ఉన్నత న్యాయస్థానాలు ఒక వైఖరి తీసుకున్నప్పుడు దానిపై దానికి గురైనా వారి నుంచి విమర్శ వస్తుంది. న్యాయవాదులు వాటిని స్వీకరించాలి. ఎందుకంటే వారెప్పుడూ రాజకీయాల్లో భాగమే. కాంగ్రెస్‌లో కమ్యూనిస్టుల్లో ముందు నుంచి వున్నారు. ఎప్పుడైనా ప్రజలకు అనుకూలమైన రాజకీయ వైఖరితో నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరో కొందరు వ్యక్తులకు కాదు ప్రజల హక్కులను కాపాడటం, న్యాయ సూత్రాలను పాటించడం ముఖ్యం..... విజయవాడ సభలో నేను లిఖిత ప్రసంగం చదవలేదు. అప్పటికప్పుడు మాట్లాడాను. మానవ హక్కుల రక్షణలో ఒక ముఖ్యమైన భాగం న్యాయ సమీక్ష. న్యాయ వ్యవస్థ నిస్పక్షపాతంగా పని చేయాలని మాత్రమే అన్నాను. ధనవంతులు పేదలు ఎవరైనా సరే, అది కూడా మానవ హక్కుల్లో భాగమే.
ఇద్దరు న్యాయమూర్తులపై ప్రభుత్వ అభ్యంతరం గురించి కూడా మీరు మాట్లాడారు. వారు అక్కడ భూమి తీసుకున్నారనే ఆరోపణ వున్నప్పుడు విచారించే ధర్మాసనంలో వుండరాదంటారా?
నేను ఆ మాట అనలేదు. వుండాలో వద్దో సంబంధిత జడ్జిలు నిర్ణయించుకోవాల్సిందే. అయితే మీరు పక్షపాతం చూపించే అవకాశం వుందని ఆరోపణ వచ్చినపుడు, ఆ అవకాశం వుందనే మాట కక్షిదారు నుంచి వచ్చినపుడు దానిపై సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే పైకోర్టు వుంది. నేను ధర్మాసనం లోనే వుండి విచారించాననుకోండి. రేపు సుప్రీంకోర్టు తప్పుకోమని చెప్పొచ్చు. లేదా ఆమోదం తెల్పవచ్చు. నేను చెప్పేదల్లా కక్షిదారుగా వున్న ఒక ప్రభుత్వం నుంచే ఆరోపణ వచ్చినపుడు మీరు సమాధానమివ్వాలి. అప్పుడే లిఖితపూర్వకంగా జవాబివ్వాలి. ఎందుకంటే దాన్ని బట్టి ఆరోపణ చేసేవారు మరో కోర్టుకు వెళ్లదల్చుకుంటే వెళతారు. అంతా అయిపోయాక చెప్పినా ప్రయోజనం వుండదు. అదొక న్యాయ ప్రక్రియ.
కాని తీర్పుతో పాటే ఆ లిఖిత సమాధానం విషయం పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.
అది ఆయన నిర్ణయం. జడ్జిపై ఆరోపణ వచ్చినపుడు అక్కడికక్కడే చెప్పాలి. ఉదాహరణకు భూ సేకరణ కేసులో అరుణ్‌ మిశ్రా వుండనన్నారు. నేను వెళ్లనన్నాడు. అది సుప్రీం కోర్టు గనక పైన మరొకటి వుండదు. హైకోర్టు విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం వుంది. కనుక మీ ఉత్తర్వులు అక్కడికక్కడే ఇవ్వాలి. కోర్టులు అధికారులకు నోటీసులు ఇవ్వవచ్చు. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం మాత్రం పరిధిలో వుండదు. న్యాయమూర్తుల పైన లేక మరెవరి పైనానా హీనమైన ప్రచారాలు అనుమతించకూడదు. అయితే అలాంటివారి కోసం అమెరికాకు సిబిఐ వెళ్లవలసినంత అవసరం వుందా!
కొంచెం పక్కకు వెళదాం. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్ తనపై ఒక మహిళ చేసిన ఆరోపణలు విచారించిన ధర్మాసనంలో కూచున్నారు. తర్వాత ఇప్పుడు ఆత్మకథలో కూచోకుండా వుండాల్సిందని అంటున్నారు..
విచిత్రమేమంటే ఆ పుస్తకానికి 'న్యాయమూర్తికి న్యాయం' అని టైటిల్‌ పెట్టారు. ఆ పుస్తకం విడుదలైనప్పుడు మొదటి కాపీ తీసుకోవడానికి రావలసిందిగా రంజన్‌ గొగోయ్ నన్ను పిలిస్తే ఈ వివాదం కారణంగానే ఒప్పుకోలేదు....దేశంలో అత్యున్నత పదవి అలంకరించిన తర్వాత మీరు పార్లమెంటు సభ్యుడవడం ఏమిటి? కలెక్టరుగా రిటైరైన తర్వాత ప్యూన్‌ ఉద్యోగానికి వెళతారా? నేను ఏ ట్రైబ్యునల్‌ పదవికి గాని విచారణ కమిషన్ల బాధ్యత గాని తీసుకోలేదు. యుపిఎ హయాంలో మోడీ మీద వచ్చినౖ ఒక వ్యక్తిగత ఆరోపణపై విచారణ బాధ్యత తీసుకోవాలని సోనియా గాంధీ కోరితే నిరాకరించాను.
కొలీజియం పద్ధతిపై విమర్శలు, నచ్చని వారిని న్యాయమూర్తులుగా నియమించకుండా హక్కు మాకుందని రాజ్యసభలో మంత్రి కిరణ్‌ రిజ్జు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు?
కొలీజియం వ్యవస్థ వాళ్లకు ఉభయ తారకంగా వుంది. ప్రభుత్వం తనకు కావలసిన వారిని కొందరిని నియమించేలా చూసుకుంటే సుప్రీం కోర్టు ఎంచుకున్నవారు కొందరు అవకాశం పొందుతున్నారు. స్వతంత్రంగా వుండే ప్రధాన న్యాయమూర్తులను చిన్న కోర్టులకు పంపడం, ఆ సిఫార్సులను తొక్కిపట్టడం జరుగుతున్నది. కొందరు న్యాయమూర్తులు లౌకికతత్వానికి విరుద్ధంగా మాట్లాడినా చలామణి అవుతున్నది. కాశ్మీర్‌ 370 వంటి కేసులు జాప్యం అవుతుంటే వ్యక్తిగత వ్యవహారాలు, అలంకార ప్రాయమైన సమస్యలు ఎక్కువ ప్రాధాన్యత పొందుతున్నాయి.
హైదరాబాదులో అంతర్జాతీయ వాణిజ్య వివాద కేంద్రం ప్రారంభిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి మధ్యవర్తిత్వం, సుప్రీం కోర్టు బాధ్యతలు విభజన ద్వారా భారం తగ్గించడం గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎలా చూడాలి?
కేసులు ఆలస్యం అవుతున్నకొద్ది కార్పొరేట్లు ఇతర మార్గాలలో పరిష్కారం చేసుకుంటామంటున్నారు. మధ్యవర్తిత్వం లాంటివి ఎన్ని చెప్పినా న్యాయం ఇవ్వాల్సిన బాధ్యత కోర్టులపై వుంటుంది. చివరగా సుప్రీం కోర్టు బాధ్యతలను నాలుగుగా విభజించడం సరికాదని నేను వ్యాసం రాశాను. కేసుల పెండింగు తగ్గించడానికి ఇతర పద్ధతులు చూడాలి గాని రాజ్యాంగపరమైన బాధ్యతలు తప్పక నిర్వహించాల్సిందే.
మార్క్సిజంతో పాటు అంబేద్కర్‌ ఆలోచనలు కూడా అవసరమని భావించినందునే జై భీమ్‌ అని టైటిల్‌ పెట్టారా?
అన్ని భాషలలో విడుదల చేయాలి గనక తమిళంలో టైటిల్‌ పెడితే సమస్య. గతంలో జై భీమ్‌ అనేది దళితులకు సంబంధించిందిగా చూసేవారు. ఇప్పుడు అందరూ అంటున్నారు. ఆ చిత్రం విజయవంతమైంది గనకే ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు.

పూర్తి ఇంటర్వ్యూ కోసం.... https://youtu.be/IPzj0ZeNL_A