కరోనా రెండో వేవ్ వచ్చినప్పటి నుంచి అనేకమంది ... తమదైన రీతిలో ప్రజలకు సేవలందిస్తూ తమలోని మానవతా కోణాన్ని చాటుకుంటున్నారు. కొందరు రోడ్లపై ఉండేవారికి భోజనాలు పెడితే... మరికొందరు పేదలకు నిత్యావసరాలు పంచుతున్నారు. రెండో వేవ్ నేపథ్యంలో అంబులెన్స్‌లు.. ఆస్పత్రులు.. ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఆ కొరత తీర్చేందుకు కొందరు తమ వాహనాలను అంబులెన్స్‌లుగా మార్చేస్తున్నారు. కాశ్మీర్‌లో ఓ యువకుడు తన పడవను అంబులెన్స్‌గా మార్చి ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఈ యువకుడి పేరు తారిక్ అహ్మద్ పట్లూ. కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉంటున్నాడు. ఈమధ్యే కరోనా బారిన పడి కోలుకున్నాడు. ఆ సమయంలోనే కరోనా అంటే ఏంటో, దాని వల్ల ప్రజలు పడుతున్న కష్టాలేంటో స్వయంగా తెలిశాయి. అంతే...! కోవిడ్ నుంచి బయటపడ్డాక తన పడవను అంబులెన్సుగా మార్చేశాడు. దాల్ సరస్సులో కరోనా పేషెంట్లను తన పడవలో తీసుకెళ్తున్నాడు.
పడవలో పీపీఈ కిట్స్
ఈ పడవ అంబులెన్స్‌లో పీపీఈ కిట్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు స్ట్రెచర్స్, వీల్ చైర్ కూడా ఉన్నాయి. దీని ద్వారా కరోనా పేషెంట్లను ఆస్పత్రులకు తీసుకెళ్లడం తేలికవుతోంది. పట్లూకి కరోనా వచ్చినప్పుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కోలుకున్నాక కూడా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఎవరూ బోట్ ఎక్కనివ్వలేదు. ఎవరి భయం వారిది. అప్పట్లో పట్లూ... 20 రోజులు ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాడు. అప్పుడప్పుడూ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. ప్రతిసారీ అదే సమస్య ఎదురైంది. తనలాంటి బోట్ నడిపేవారే తనను ఎక్కించుకోవడానికి భయపడటం చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతో బాధపడ్డాడు. తనలాగా ఇంకెవరికీ అవ్వకూడదనే ఈ అంబులెన్స్ సర్వీసులు తెచ్చాడు.
శ్రీనగర్‌కి టూరిస్టులు పెద్ద సంఖ్యలో రావడంతో అక్కడ కరోనా కేసులు పెరిగాయి. ఏప్రిల్ 25న తులిప్ గార్డెన్ ఓపెన్ చేశాక మరింతగా పెరిగారు. దాంతో కేసులు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తనలాంటి వారికి ఎందరికో సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నాడు. తన ద్వారా కొందరికైనా సాయం అందుతున్నందుకు సంతోషంగా ఉందని చెబుతున్నాడు.