Sep 12,2023 23:23

రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు పరిధిలో మిర్చి మొక్కలు నాటిస్తున్న రైతులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : మిర్చి సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు ప్రస్తుతం ఆ మొక్కలు నాటేందుకు అదును దాటుతోందని ఆందోళనకు గురవుతున్నారు. నీటిని రూ.వేలు వెచ్చించి ట్యాంకర్ల కొని మిర్చి సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20వ తేదీ లోపు తేజ రకం మిర్చి సాగుకు మంచి అదును అని, ఆ తర్వాత బాడిగ రకం వంటి ఇతర రకాల సాగుకు వచ్చేనెల 10-15 తేదీల వరకూ అవకాశం ఉన్నా అప్పటి వరకు ఆగితే దిగుబడులు అంత ఆశాజనకంగా ఉండవని రైతులు భావిస్తున్నారు. అందుకే ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి సాగు చేస్తున్నామని చెబుతున్నారు.
నాగార్జునసాగర్‌ జలాశయంలో ఆశించిన మేర నీరు లేకపోవడంతో ఆరుతడి పంటలు వేసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కొందరు రైతులు వర్షాల మీదే నమ్మకం పెట్టుకుని మిర్చి సాగు చేస్తున్నారు. అదును దాటడం, ఇటీవల కురిసిన వర్షాలకు నేల పదును కాకపోయి నప్పటికీ సాగు ప్రయాత్నాలను కొనసాగి స్తున్నారు. సాధారణంగా ఎకరా విస్తీర్ణంలో మిర్చి మొక్క నాటే నాటికి దుక్కులు దున్నడం, ఎరువులు తదితర ఖర్చులు పోల్చుకుంటే అదనంగా రూ.10 వేలు వరకు ఖర్చులు అవుతున్నాయి. పొలంలో బావి మాదిరి గుంట తీసి ట్యాంకర్‌ ద్వారా ఓగేరు వాగు నుండి నీటిని తెచ్చుకుని అందులో పోస్తుస్తున్నారు. ఈ నీరు భూమిలో ఇంకిపోకుండా గుంతలో టార్ఫాలిన్‌ పట్టాల వేసుకుని నిల్వ చేసి మొక్కలు నాటుతున్నారు. నెల క్రితం ఇదే తరహాలో మొక్కలు సాగు చేసిన రైతులు మొక్కలు బతికించేందుకు ట్యాంకర్‌ నీరు రూ.1400 నుండి దూరాన్ని బట్టి రూ.2 వేలు వరకు వెచ్చిస్తున్నారు. ప్రభుత్వం ఆరుతడి పంటలకు నీరిచ్చినా ఇలా అత్యవసర పరిస్థితుల్లో పంట కాలం పూర్తయ్యే వరకు మొక్కలకు నీరు ఇవ్వాల్సివస్తే ఎకరాకు అదనంగా రూ.40-50 వేలు వరకు వెచ్చించాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు.