Nov 17,2023 20:03

వరుస శిక్షలుతో బెంబేలెత్తుతున్న నిందితులు

ప్రజాశక్తి-విజయనగరం :   పోక్సో కేసుల్లో నిందితులకు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం వరుసగా శిక్షలు ఖరారు చేయడంతో కోర్టు విచారణకు హాజరవుతున్న నిందితుల వెన్నులో వణుకు మొదలయ్యింది. 2023 సంవత్సరంలో ఇప్పటి వరకు 8 పోక్సో కేసుల్లో నిందితులకు కోర్టు శిక్షలు విధించడం వెనుక కేసుల్లో పోలీసు అధికారుల దర్యాప్తు, సాక్ష్యాలు సేకరణ, సాంకేతిక నైపుణ్యం, ప్రాసిక్యూషను విచారణపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం, కేసులను నిరంతరపర్యవేక్షించి, సమీక్షించడం వంటి అంశాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ఎస్‌పి ఎం.దీపిక తెలిపారు. గతంలో పోక్సో కేసులు నమోదైనప్పటికీ న్యాయస్ధానాల్లో విచారణలో జాప్యం తలెత్తేది. నేడు పోక్సో కేసులను ప్రాసిక్యూషను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక న్యాయస్ధానాలు ఏర్పాటు, పోలీసు వాదనలను వినిపించేందుకు ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకాలు జరగడంతో సత్ఫలితాలి స్తున్నాయి. ఈ ఏడాది 8 పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షపడగా, వాటిలో ఐదు కేసుల్లో నిందితులకు 20సంవత్సరాలకు పైబడి జైలు జీవితం అనుభవించే పరిస్థితులు ఏర్పడ్డాయి.
జిల్లాలో ఇటీవల నిందితులకు శిక్ష పడిన పోక్సో కేసుల వివరాలు
- దిశ మహిళా పోలీసు స్టేషనులో 21.9.2021 న నమోదైన పోక్సో కేసులో గంట్యాడ మండలం కొర్లాం గ్రామం కారు చిన్నారావు (33)కు 20సంవత్సరాలు జైలు శిక్ష, రూ.16వేలు జరిమానా జైలు విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్ధానం ఏప్రిల్‌ 21న తీర్పు వెల్లడించింది.
- గంట్యాడ పోలీసు స్టేషనులో 10.10.2019న నమోదైన పోక్సో, అట్రాసిటి కేసులో నిందితుడైన గంట్యాడ మండలం కొండతామరాపల్లికి చెందిన సారిపల్లి చిన్నారావు (65)కు 20ఏళ్ల జైలుశిక్ష, 2వేల జరిమానా విధించారు.
- విజయనగరం 1వపట్టణ పోలీసు స్టేషనులో 24.6.2022న నమోదైన పోక్సో కేసులో నిందితుడైన శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం మండలం పెద్దసీది గ్రామానికి చెందిన ధర్మాన ప్రసాద్‌ అలియాస్‌ రుషికుమార్‌ (20)కు 20సంవత్సరాలు జైలు, రూ. 20వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
- విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషనులో 2018లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన విజయనగరం పట్టణం లంకాపట్నంకు చెందిన పొడుగు అరవింద్‌ (22)కు 3ఏళ్ల జైలుశిక్ష, రూ.1500 జరిమానా కోర్టు విధించింది.
- బొబ్బిలి పట్టణ పోలీసు స్టేషనులో 2019లో నమోదైన పోక్సో కేసులో కంచరవీధికి చెందిన విక్రమ్‌ యేసు (34)కు నాలుగేళ్ల జైలు, రూ.1000 జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్ధానం తీర్పునిచ్చింది.
- బొబ్బిలి పోలీసు స్టేషనులో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన బొబ్బిలి మండలం మెట్టవలసకు చెందిన అడబాల సతీష్‌ (23)కు 2ఏళ్ల 3నెలలు జైలు, రూ.1500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
- బొబ్బిలి పట్టణ పోలీసు స్టేషనులో 2019లో నమోదైన పోక్సో కేసులో బొబ్బిలి మండలం పాతపెంటకు చెందిన గిరడ లక్ష్మణకు 23 ఏళ్ల ఆరు నెలలు జైలు శిక్ష, రూ.11, 500 జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్ధానం తీర్పు వెల్లడించింది.
- చీపురుపల్లి పోలీసు స్టేషనులో 2018లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన గరివిడికి చెందిన కాకర్లపూడి రాంకుమార్‌ వర్మ (24)కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ ఈనెల 16న కోర్టు తీర్పు వెల్లడించింది.