
కురుపాం : పదో తరగతే విద్యార్థులకు ప్రధాన ఘట్టమని, కావున విద్యార్థులు కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్ అన్నారు. మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వంటగది, స్టాక్ రూములను సందర్శించి విద్యార్థులకు వండిన పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి సామర్థ్యాన్ని పరిశీలించి సబ్జెక్టుల్లో ఏమైనా సందేశాలుంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఇప్పటి నుంచే కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించి త్వరితగతిగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఐటిడిఎ ద్వారా నిర్మాణం జరుగు తున్న పెట్రోల్ బంకు పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.రామగోవిం దం, వసతి గృహ సంరక్షణ అధికారి కె. సూర్యనారాయణ, ఉపాధ్యాయు లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
టెన్త్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి : ఆర్‌డిఒ
కొమరాడ :పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆర్‌డిఒ కె.హేమలత అన్నారు. శుక్రవారం స్థానిక కెజిబివి పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారు చదువుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షలు కీలకమని, ఇప్పటి నుంచే బాగా చదవాలని హితవు పలికారు. సబ్జెక్టుల్లో సంశయాలుంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్, గణితం మీద దృష్టి సారించాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో ముఖా ముఖి మాట్లాడారు. విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యా బోధనలు అందించి ప్రత్యేక తరగతులు నిర్వహించి వారికి ఉత్తమమైన మార్కులు వచ్చేలా ఉపాధ్యాయులకు కృషి చేయాలన్నారు. అనంతరం ఆరు, 9వ తరగతి నిర్వహిస్తున్న మోడల్ పరీక్షలను ఆర్డివో పరిశీలిం చారు. పలువురు విద్యార్థులకు హిందీ సబ్జెక్టుపై చదివించేం దుకు ప్రయత్నం చేసినప్పటికీ కొంత విద్యార్థులు తడబడడంతో అవగాహన కల్పించారు. ఇకపై వారంలో ఒకటి లేదా రెండుసార్లు పాఠశాలను సందర్శిస్తానని తెలిపారు.
నూతన భవనం ప్రారంభానికి చర్యలు తీసుకోండి
మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న రెవెన్యూ కార్యాలయ భవనం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆర్‌డిఒ హేమలత అధికారులకు సూచించారు. నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న భవనాన్ని ఆమె పరిశీలించారు. పాత కార్యాలయంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఆర్‌డిఒ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం భవనాన్ని పరిశీలించి తక్షణమే ప్రారంభానికి సిద్ధం చేయాలని, అవసరమైన నివేదికలను సిద్ధం చేయలన్నారు. ఆర్‌డిఒ వెంట తహశీల్దార్ మల్లికార్జునరావు, ఎంఇఒ జామి నారాయణస్వామి, ఆర్‌ఐ శ్రీనివాసరావు, కెజిబివి స్పెషల్ ఆఫీసర్ అరుణ, తదితరులు ఉన్నారు.