May 14,2023 02:15
బాధితులను పరామర్శిస్తున్న శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌

ప్రజాశక్తి-అద్దంకి: గ్రామాల్లో ప్రజారోగ్యం పడకేసిందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా సంతమాగులూరు మండలం పత్తేపురం, సజ్జాపురం, గ్రామాలలో పలు వివాహ వేడుకలకు ఎమ్మెల్యే గొట్టిపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాలలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని, పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వందలాది వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చామంటూ ప్రచార ఆర్భాటాలకు పోతున్న ప్రభుత్వం ప్రబలిపోతున్న మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ జ్వరాలను నియంత్రించడంలో పూర్తి వైఫల్యం చెందిందని అన్నారు. గ్రామాలలో పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో సీజనల్‌ వ్యాధుల బారిన పడి నియోజకవర్గంలో ప్రజారోగ్యం పడకేసిందని అన్నారు. విషజ్వరాలు, డెంగీ, మలేరియా జ్వరాల బారినపడి ప్రజలు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.