Nov 17,2023 22:28

పడకేసిన పారిశుధ్యం

పడకేసిన పారిశుధ్యం

- డ్రైనేజీలు అస్తవ్యస్తం
- పల్లెలు దుర్గంధభరితం
- స్పందించని అధికారులు
ప్రజాశక్తి -వెంకటగిరి రూరల్‌ : వెంకటగిరి మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో పారుశుధ్యం పడకేసింది. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. పల్లెలు దుర్గంధభరితమయ్యాయి. దోమలు అధికం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రభలే ప్రమాదం వుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయినా సంబంధిత శాఖ అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చెలికంపాడు, కుర్జా గుంట 20 పంచాయతీలలో సైడు కాలువలు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండడంతో మురుగు నీరు వీధుల్లో ప్రవహిస్తూ దుర్గంధపు వాసనతో పల్లెలు పలుకరిస్తున్నాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ అమలు కాకముందు మండల ప్రజాపరిషత్‌ అధికారి, పంచాయతీ కార్యదర్శి పరిశుభ్రతపై దృష్టి సారించేవారు. కాని సచివాలయ వ్యవస్థ వచ్చిన తరువాత 14వ,15వ ఆర్ధిక సంఘం నిధులు వచ్చినా పనులు చేయకనే నిధులు మాయమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. గతంలో సిబ్బంది తక్కువగా ఉన్నా గ్రామాలు పరిశుభ్రంగా ఉండేవని నేడు సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని శాఖ సిబ్బంది ఉన్నా, సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లెలో పారిశుధ్య కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్‌ వున్నా మురుగునీటి కాలువలు పూడిక తీయడం లేదని, చీపురు కట్టలతో శుభ్రం చేసినట్లు ఫొటోలు తీసి ఆన్‌ లైన్‌ లో అప్‌ లోడ్‌ చేసి వెళుతున్నారని నెల, నెలా కాకపోయినా ఆరు నెలలకు ఒక సారైనా జీతాలు తీసుకొంటున్నారే తప్ప గ్రామాలలో వీధులు, కాలువలు శుభ్రం చేయడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు ద్వారా మురుగునీటి కాలువల్లో బ్లీచింగ్‌ చల్లడం లేదని వాపోతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు వైద్య ఆరోగ్యశాఖ, ఎంపిడిఓ, పంచాయతీ కార్యదర్శి పంచుకోవడం తప్ప పల్లెలో పనులు చేయడం లేదని తెలిపారు. వర్షాకాలం దష్ట్యా సీజనల్‌ వ్యాధులు , జ్వరాలు పల్లెలో ప్రభలే ప్రమాదం ఉంది. కాలువలో మురుగునీరు నిల్వ ఉండడం వల్ల దోమలు అధికమై విషజ్వరాలు, మలేరియా, డెంగీ, తదితర సీజనల్‌ వ్యాధులు త్వరగా వ్యాప్తించే ప్రమాదం వుందని మండల ప్రజాపరిషత్‌ అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతంలో మురుగు కాలువల పూడిక తీయించి, నీరు నిల్వలేకుండా చాడాలని ప్రజలు కోరుతున్నారు.
విష జ్వరాలు ప్రభలుతున్నాయి..
మా గ్రామంలో ఎంతో కాలంగా కాలువలు పూడికి తీయక పోవడంతో వర్షాలు పడి నీళ్లు నిలబడి దోమలు వ్యాపించి జ్వరాలు వస్తున్నాయి. దీనిపై సచివాలయ అధికారులకు తెలిపినా పట్టించుకోవటం లేదు. తాగునీటి బోరు దగ్గరే మురుగు నీరు చేరి బోరు బావి కలుషితం అవుతోంది. అధికారులు స్పందించాలి.
- కష్ణయ్య, చెలికంపాడు గ్రామ పంచాయతీ.