ఎక్కడికక్కడ నిలిచిన ప్రభుత్వ భవనాల పనులు
మొండిగోడలు, పునాదులతో దర్శనం
ఏళ్లతరబడి సాగుతున్న నిర్మాణాలు
బిల్లుల విడుదలలో ప్రభుత్వ జాప్యమే కారణం
పనుల ఆలస్యంతో ఏయేటికాయేడు పెరుగుతున్న నిర్మాణ వ్యయం
ప్రజలకు, ఉద్యోగులకు తప్పని అవస్థలు
ప్రజాశక్తి - భీమడోలు
మండలంలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు పడకేశాయి. వీటి ప్రగతిపై మండలస్థాయి అధికారులు ప్రతీవారం నిర్వహించే సమీక్ష సమావేశాలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఆరు నెలలుగా వీటి నిర్మాణాలకు ప్రభుత్వం రాయితీపై సరఫరా చేయాల్సిన సిమెంట్‌ను నిలిపివేయడం, నిర్మాణాలు పూర్తికావొచ్చిన భవనాలకు పూర్తిస్థాయి బిల్లుల చెల్లింపులు లేకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ జాప్యం వల్ల నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. దీంతో గుత్తేదారులు వాటిని నిర్మించేందుకు ముందుకు రావడం లేదు. హెల్త్ క్లినిక్ నిర్మాణాల విషయంలో. ఈ లోపాన్ని గుర్తించిన ప్రభుత్వం గతంలో ఒక్కొక్క భవన నిర్మాణానికి అవసరమైన రూ.17.50 లక్షలకు అదనంగా మరో రూ.మూడు లక్షలు కేటాయించినప్పటికీ గుత్తేదారులు ముందుకు రావడం లేదు. మండలంలో 17 గ్రామ సచివాలయ భవన నిర్మాణాలకు రూ.6.60 కోట్లు కేటాయించగా వీటిలో తొమ్మిది మాత్రమే పూర్తయ్యాయి. మండల పరిధిలో 17 రైతు భరోసా కేంద్రాలను నిర్మించాల్సి ఉండగా ఒక్కొక్కదానికి. రూ.21.80 లక్షలు కేటాయించారు. వీటిలో నాలుగు భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. ఆరు భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలినవి ప్రారంభం కాలేదు. 17 వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌లు నిర్మించాల్సి ఉంది. వీటిలో భీమడోలు మినహా ఇతర చోట్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. దీన్ని గమనించిన అధికారులు ఒక్కొక్క నిర్మాణానికి కేటాయించిన రూ.17.50 లక్షలకు అదనంగా మరో రూ.మూడు లక్షలు కేటాయించినప్పటికీ నిర్మాణాల ప్రగతి లేదు. మండలంలో అముల్ పాల సేకరణ కేంద్రాల నిర్మాణాలకు ఒక్కోదానికి రూ.12.81 లక్షలు కేటాయించారు. వీటిలో కోడూరుపాడు, దుద్దేపూడి మినహా ఇతరచోట్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఇక అమూల్ బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల కోసం ఒక్కొక్క దానికి రూ.18.04 లక్షలు కేటాయించారు. వీటిని గుండుగొలను, పొలసానిపల్లి, ఎంఎం.పురం గ్రామాలకుప్రత్యేకించారు. నిర్మాణాలు ఇంతవరకూ ప్రారంభం కాలేదు. అంబరుపేట, కోరుకొల్లు గ్రామ పంచాయతీలు మినహా మండలంలోని ఇతర గ్రామపంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి ఒక్కొక్కదానికి రూ.16.10 లక్షలు కేటాయించగా నిర్మాణాలు ఏ ఒక్కటీ ప్రారంభం కాలేదు. మండల పరిధిలో నిర్మాణాలు ప్రారంభించిన యూనిట్ల విలువ రూ.9.73 కోట్లు కాగా వీటిలో 60 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. 90 లక్షల రూపాయల బిల్లుల చెల్లింపు నెలల తరబడి పెండింగ్‌లో ఉంది. ఇక నిర్మాణపరంగా వస్తే ప్రభుత్వం ప్రాధాన్యత భవనాల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు సరఫరా చేసేందుకు అంగీకరించింది. ఇదేవిధంగా నిర్మాణాలకు అవసరమైన సిమెంటు బస్తా రూ.270కు అందజేసేందుకు సంసిద్ధత వెలిబుచ్చింది. ప్రభుత్వం సిమెంట్ కంపెనీలకు సకాలంలో చెల్లింపులు జరపని కారణంగా ఆరునెలలుగా సిమెంట్ సరఫరా నిలిచిపోయింది. నిర్మాణాలు ఆగిపోయాయి. ఇదేక్రమంలో ఆ కంపెనీలకు చెల్లించాల్సిన బిల్లులను గృహనిర్మాణ సంస్థ చెల్లించడం వల్ల వారి అవసరాలకు అనుగుణంగా బస్తాకు రూ.270కే అందించడం గమనార్హం. మండలంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ.15.86 కోట్లు మంజూరు కాగా వీటిలో సుమారు రూ.ఆరు కోట్ల విలువగల పనులు పూర్తయ్యాయి. కొంతమేరకు చెల్లింపులు జరిగాయి. సుమారు కోటి రూపాయలు బకాయిలు గుత్తేదారులకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం సరఫరా చేస్తానన్న రాయితీ సిమెంట్, ఇసుక సకాలంలో అందజేసి, బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తే నిర్మాణాలు వేగవంతం చేస్తామని గుత్తేదారులు అంటున్నారు. ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన పనులు. కానీ అంతకుముందు టిడిపి హయాంలో చేపట్టిన పనులకు ఇంతవరకూ బిల్లుల చెల్లింపు జరగలేదు. నిర్మాణాలు మందగించడం వెనక ఇది కూడా ఒక కారణంగా గుత్తేదారులు పేర్కొంటున్నారు.










