Jun 07,2023 19:27

పేరుకుపోయిన చెత్తాచెదారం

ప్రజాశక్తి - హోళగుంద
మండలంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత పడకేసింది. ఈగలు సంచరించడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఎక్కడ కూర్చున్నా, నిల్చున్నా దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు పందులు సంచరించడం వల్ల, ఆరుబయట బహిర్భూమికి వెళ్లడం వల్ల పరిశుభ్రత లోపించింది. గతంలో కేంద్ర ప్రభుత్వం మరుగుదొడ్లు నిర్మించినా అవి ఇప్పటివరకు వాడకంలో రాలేదు. అందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు. మురుగుదొడ్లను వినియోగించుకునేలా అవగాహన కల్పించాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీల్లో నిధులు లేవన్న సాకుతో పంచాయతీ కార్యదర్శులు వచ్చామా, వెళ్లామా అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు మండిపడుతున్నారు. మేజర్‌ పంచాయతీల్లో ప్రజలు కట్టిన పన్నులు దుర్వినియోగం అవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గతనెల రోజులుగా ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోనూ దోమలు వృద్ధి చెంది ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా బాత్‌రూములో, టాయిలెట్లలో కూడా దోమలు అధిక సంఖ్యలో ఉండడం వల్ల అసౌకర్యాలకు గురవుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. తినుబండారాలపై వాలి ఆహారాన్ని సైతం కలుషితం చేస్తున్నాయని పేర్కొంటున్నారు. డెంగీ, మలేరియా తదితర రోగాల బారిన పడి కూలి డబ్బులు సైతం ప్రయివేట్‌ హాస్పిటల్‌లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మండలంలో ఏ గ్రామంలోనూ డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదు. బహిరంగ ప్రదేశాల్లో, కుంటల్లో కలుషితమైన నీరు ఉండడం వల్ల దోమలు మరింత వృద్ధి చెంది ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దోమల నివారణకు మేజర్‌ పంచాయతీ, ఆయా పంచాయతీ అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టాల్సి ఉంది. తూతూమంత్రంగా నివారణ చర్యలు చేపడుతుండడంతో దోమలు మరింత వృద్ధి చెందుతున్నాయి. మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లపై మురుగునీరు నిలవడం, ప్రతి వీధిలో చెత్తాచెదారం ఉండడం వల్ల అపరిశుభ్రత తాండవిస్తోంది. మేజర్‌ పంచాయతీలో పందులు ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తున్నాయి. పందుల పెంపకందారులు ఊరు చివరలో, జనసంచారం లేని చోట పెంచుకోవాలి, లేదంటే పందులను ఊరి నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఇక్కడ అమలు కావడం లేదు. జిల్లా అధికారులు స్పందించి పందులు గ్రామాల్లో సంచారించకుండా తగిన చర్యలు తీసుకుని, దోమల నివారణ చర్యలు చేపట్టేందుకు మండల అధికారులకు, ప్రజాప్రతినిధులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.

దుర్వాసన వెదజల్లుతున్న మురుగు