
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గత సీజన్‌లో ఎదురైన నష్టాలతో ఈ ఏడాది పసుపు రైతుల్లో ఉత్సాహం తగ్గింది. అమ్మబోతే అడవి... కొనబోతే కొరివి.. అన్నట్లుగా మారుతున్న పరిస్థితులతో రైతులు అసహనానికి గురవుతున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతులు నష్టాలు మూటగట్టుకుంటుంటే దళారులు మాత్రం లాభాలు పొందుతున్నారు. గత సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర రూ.6850కు పంటను ఎక్కడా కొనుగోలు చేయలేదు. కేవలం రూ.5 వేలకే కొనుగోలు చేశారు. ప్రస్తుతం క్వింటాళ్ రూ.12 వేలకు చేరడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తాము అమ్మే సమయంలో ధరలు గణనీయంగా తగ్గించడం, ఆతరువాత కొద్ది కాలానికే భారీగా పెరచడం పరిపాటైందని మండిపడుతున్నారు.
పసుపు సాగులో ఏటికేడు పెట్టుబడులు పెరగడం, ధరలు మాత్రం తగ్గడంతో రైతులు సాగుకు విముఖత చూపుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 16,500 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా ఈ ఏడాది ఇప్పటివరకు 7,200 ఎకరాల్లోనే సాగైంది. ప్రస్తుత గుంటూరు జిల్లాలో 5500 ఎకరాల్లో సాగవుతుందని భావించగా 3,800 వేల ఎకరాల్లోనే వేశారు. అయితే అనూహ్యంగా ఖరీఫ్ సాగు ముగింపు సమయంలో పసుపు ధరలు గణనీయంగా పెరిగాయి. బాపట్ల జిల్లాలో 4 వేల ఎకరాలకు గాను కేవలం 400 ఎకరాల్లోనే, పల్నాడు జిల్లాలో 7 వేల ఎకరా లకు గాను మూడు వేల ఎకరాల్లోనే పసుపు సాగైంది.
గత మే మొదటి వారంలో భారీ వర్షాలకు కళ్లాల్లో, రహదారులపై ఆరబోసిన పసుపు పంటకు భారీ నష్టం వాటిల్లింది. జులైలో పసుపు కొనుగోలుకు చర్యలు తీసుకున్నా నాణ్యత పేరుతో ధరను అమాంతం తగ్గించారు. పసుపు రైతులు ఎకరాకు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టగా 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాళ్ రూ.5 వేలకు మించి కొనుగోలు చేయకపోవడం వల్ల ఈ ఏడాది ప్రతి రైతు రూ.లక్షన్నర వరకు నష్టపోయాడు. 80 శాతం మంది రైతులు తక్కువ ధరలకే అమ్ముకున్నారు. రైతులవద్ద 90 శాతం సరుకు విక్రయాలు పూర్తయిన తరవాత ధరలు గణనీయంగా పెరిగాయి. గత మూడేళ్లుగా సరైన ధరల్లేక రైతులు పసుపు సాగుకు దూరం అయ్యారు. దుగ్గిరాలలో పసుపు యార్డు ఉన్నా రైతులకు ఆశించిన ప్రయోజనాలు దక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతియేటా రూ.వేలకోట్ల విదేశీమారక ద్రవ్యం తెచ్చిపెడుతున్న పసుపు కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం తగిన శ్రద్ధచూపడం లేదు. పసుపు మద్దతు ధర రూ.10 వేలు ఇవ్వాలనే డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. పసుపు బోర్డు ఏర్పాటు ఎన్నికల హామీగానే మిగిలింది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోడీ నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినా ఆచరణలో ఎప్పటికి సాధ్యమోనని రైతులు పెదవి విరుస్తున్నారు.