Aug 28,2023 23:51

మిర్చిపైరుకు మందు పిచికారీ చేసేందుకు చిలకలూరిపేట ప్రాంతంలో రైతుల తిప్పలు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లాలో ఈ ఏడాది భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. గత నాలుగేళ్లలో వర్షాలు ఆశాజనకంగా ఉండటం, కృష్ణానదికి ఏటా వరద రావడం రావడంతో నీటి ఎద్దడి రాలేదు. భూగర్భ జలాలు ఆశాజనకంగా కొనసాగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు కనీస వర్షపాతం నమోదు కాకపోవడం, వరదలు రాకపోవడంతో భూగర్భ జలాల మట్టం గణనీయంగా తగ్గిపోతోంది. ప్రధానంగా వినుకొండ, నర్సరావుపేట, చిలకలూరిపేట, గురజాల, మాచర్ల, సత్తెనపల్లి నియోజకవర్గాలకు ఈ సమస్య ఎక్కువగా ఉంది.
గత నెల రోజుల కాలంలో నిర్ణీత లక్ష్యంలో 20 శాతం కూడా వర్షం కురవని మండలాలు 10కి పైగా ఉన్నాయి. గత మూడునెలల కాలంలోఇదే పరిస్థితి నెలకొంది. పల్నాడు జిల్లాలో 28 మండలాలు ఉండగా 11 మండలాల్లో గత మూడునెలల్లో 25 మిల్లీ మీటర్ల కన్నా తక్కువ వర్షం కురిసిన మండలాల్లో వెల్దుర్తి, కారంపూడి, అమరావతి, నకరికల్లు, నూజెండ్ల, శావల్యాపురం, గురజాల, పిడుగురాళ్ల, మాచర్ల, బొల్లాపల్లి, రెంటచింతల ఉన్నాయి. నాలుగేళ్లుగా జులై, ఆగస్టులో వరదలు రావడం, ఎక్కువ రోజులు సాగర్‌ కాల్వలకు నీరు విడుదల కావడం వల్ల కొంతమేరకు సాగు నీటి సమస్య రాలేదు. ఈ ఏడాది కాల్వలకు నీరు రాకపోవడం, వర్షాలు కురవకపోవడం, బోర్లు ద్వారా సాగు కోసం భూగర్భ జలాలు కూడా తగ్గిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్‌లో 80.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 81.3 మిల్లీ మీటర్లు, జులైలో 131 మిల్లీ మీటర్లకు గాను 106.9 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది. ఆగస్టులో 139.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 48.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
పలు మండలాల్లో 400 నుంచి 500 అడుగల లోతులో నీటి మట్టం ఉందని కొన్ని ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని అధికారులు తెలిపారు. ఒక వైపు వర్షాభావం, మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా వేడిగాలులు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల గత ఎనిమిది నెలల కాలంలో నీటి మట్టాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో సాగు నీటి చెరువుల్లో కూడా నీటి మట్టాలు బాగా తగ్గాయి. దీంతో మిర్చిరైతులు నారు నాటేందుకు కూడా నీటిని కొనుగోలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే వేసవి నాటికి తాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు.
నాగార్జున సాగర్‌ పరిధిలో కాల్వల్లో నీటిమట్టాలు బాగా తగ్గిపోయి బురదగా మారడం వల్ల వేసిన పైర్లను కాపాడుకునేందుకు రైతులు నీటిని కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. సమీపంలోని తాగునీటి చెరువుల ద్వారా నీటిని ట్యాంకర్లలో తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే పత్తి సాగు చేసిన ప్రాంతాల్లో గతనెల రోజులుగా సరైన వర్షాల్లేక పొలం బెట్టకొస్తున్నాయి. ప్రధానంగా సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, దాచేపల్లి, యడ్లపాడు, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో పంటలకు తక్షణం నీటి అవసరం ఉంది.
గతేడాది ఆగస్టు 28 నాటికి సాగర్‌ జలాశయం నిండు కుండను తలపించింది. సాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా గతేడాది ఇదేరోజుకు 309.95 టిఎంసీలతో జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం 153.32 టిఎంసీలతో సగానికంటే తక్కువ నిల్వతో వెలవెలబోతోంది. ఎగువ నుంచి సాగర్‌కు 2,289 క్యూసెక్కులు మాత్రమే వస్తుండగా అదే స్థాయిలో కాల్వలకు విడుదల చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.