Mar 29,2023 21:15

స్టడీ అవర్స్‌ నిర్వహిస్తున్న దృశ్యం

పదిలో వంద శాతమే లక్ష్యం
- ప్రభుత్వ పాఠశాలల్లో అందరూ ఉత్తీర్ణత సాధించేలా చర్యలు
- వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి/నంద్యాల కలెక్టరేట్‌

       ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు, అధికారులు పని చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక కూడా రూపొందించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టారు..
విద్యార్థి దశలో పదో తరగతి చాలా కీలకమైనది. ప్రభుత్వ పాఠశాలలన్నీ వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు తగిన విధంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఆ మేరకు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు నిరంతరం శ్రమిస్తున్నారు. జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న 467 పాఠశాలల నుండి దాదాపు 25,411 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. పాఠశాలల్లో ఎవరైతే వెనుకబడిన విద్యార్థులు ఉంటారో వారిని గుర్తించి ప్రత్యేకంగా ఏ సబ్జెక్టులలో వెనకంజలో నిలిచి ఉంటారో ఆ సబ్జెక్టులో మరింత తర్ఫీదును సంబంధిత ఉపాధ్యాయుడి ద్వారా ఇప్పిస్తున్నారు. విద్యార్థులకు వారాంతపు పరీక్షలు నిర్వహించడమే కాకుండా మోడల్‌ టెస్టులను కూడా నిర్వ హిస్తున్నారు. దాంతో పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. విజయ దీపిక మెటీరియల్‌ను అందించి దాని ద్వారా ప్రాక్టీస్‌ చేయిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తూ సాయంత్రం స్నాక్స్‌ను కూడా అందిస్తున్నారు.
పదిలో ఉత్తీర్ణత పెంపునకు చర్యలు
జిల్లాలో పదవ తరగతిలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాము. విద్యా సంవత్సరం ప్రారంభం నుండే ఓ ప్రణాళిక ప్రకారం వెళుతున్నాం. ఈ ఏడాది మరింత ఉత్తీర్ణత సాధించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం.వ ుుఖ్యంగా విద్యార్థులను మూడు కేటగిరీలుగా విభజించి పూర్తిగా డల్‌గా ఉన్న విద్యార్థి పాస్‌ అయ్యేలాగా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఉపాధ్యాయుడికి ముగ్గురు లేక నలుగురు విద్యార్థులను దత్తత ఇవ్వడం జరిగింది. స్టడీ అవర్స్‌ పెంచడం, రివిజన్‌ టెస్ట్‌లు నిర్వహించడంతో పాటు సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఓరియంటల్‌ ప్రోగ్రాం నిర్వహించాం.
- అనురాధ, డిఇఒ.
విద్యార్థులకు ప్రత్యేక తరగతులు...
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతులను ఉదయము సాయంకాలం వేళల్లో అక్టోబర్‌ మాసం నుండి నిర్వహిస్తున్నాం. ప్రతి రెండవ శనివారము, ఆదివారములలో కూడా సబ్జెక్టుల వారీగా టైం టేబుల్‌ వేసుకొని పోర్షన్స్‌ కంప్లీట్‌ చేసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి సి, డి గ్రేడ్‌కు చెందిన విద్యార్థులకు సబ్జెక్టుల మెటీరియల్‌ తయారు చేసుకొని సంసిద్ధం చేయడం జరిగింది. పలు దఫాలుగా తల్లిదండ్రులను కలిసి వారి విద్యా పురోభివృద్ధిపై చర్చించాం.
- ఏ. నూర్జహాన్‌, హెచ్‌ఎం, ఈర్నపాడు జడ్‌పి హైస్కూల్‌, బండి ఆత్మకూరు మండలం.