ప్రజాశక్తి - తెనాలి : పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, అందుకు తోడ్పాటు అందించిన ఉపాధ్యాయులను గురువారం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో సత్కరించారు. చైర్పర్సన్ సయ్యద్ కాలేదా నసీం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలోని 6 మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికకు ఉపాధ్యాయులు వారికి తగిన తోడ్పాటును అందించాలని కోరారు. కమిషనర్ ఎం.జస్వంతరావు మాట్లాడుతూ పదో తరగతి ఎంతో కీలకమైన దశని, ఈ దశలో విద్యార్థులు క్రమశిక్షణతో రాణిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినం దించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఎం.గోపాలరావు, వైస్‌చైర్మన్ ఎం.హరిప్రసాద్, కౌన్సిలర్లు, ఆయా పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : మండలంలోని నందిగామ జెడ్‌పి పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చడంతో వారికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్‌రెడ్డి రూ.5 వేల నగదు ప్రోత్సాహకాలను అందించారు. గతంలో పాఠశాల సందర్శన సమయంలో విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం బహుమతిని హెచ్‌ఎం టి.సోమనాథ్ ద్వారా పాఠశాల ప్రథమ స్థానం సాధించిన కొల్లిపర శ్రీఇంద్రజ (529/600)కు రూ.3 వేలు, రెండో స్థానం సాధించిన పి.తేజస్విని (525/600)కి రూ.2 వేలు అందించారు.










