Mar 31,2023 00:03
బాపట్లలోని మున్సిపల్‌ హైస్కూల్‌

ప్రజాశక్తి-బాపట్ల: ఈ విద్యా సంవత్సరంలో జరిగే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నూటికి నూరు శాతం ఫలితాలే లక్ష్యంగా బాపట్ల మున్సిపల్‌ హైస్కూల్‌ ఉపాధ్యాయ వర్గం విశేష కృషి చేస్తోంది. ప్రత్యేక తరగతుల నిర్వహణ, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, పదిలో పట్టు సాధించే దిశగా విద్యార్థుల్లో నూతన ఉత్సాహం కల్పించడం పాఠ్యాంశాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే దిశగా ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నూతన విద్యా బోధనకు తెరతీస్తూ సరళమైన రీతిలో విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా పాఠ్యాంశాల బోధన ఇక్కడ జరుగుతోంది. బాపట్ల నూతన జిల్లాగా ఏర్పాటయ్యాక పది పరీక్షలు జరగడం ఇది రెండోసారి. జిల్లాలో ఈ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేస్తున్నారు. పాఠశాలలో స్టడీ అవర్స్‌, అసైన్మెంట్‌, హౌంవర్క్‌, రోజు వారి పరీక్షలతో పాటు, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. పరీక్షల్లో పదును పెంచేందుకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వారు ఇచ్చే ప్రశ్నపత్రాలు (విజయస్ఫూర్తి)ని చదివిస్తూ తిరిగి రాయిస్తూ పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు వారికి అవగాహనతో పాటు ధైర్యం కల్పిస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సరళమైన విద్యా బోధనలో నూరు శాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు. దీనికి తోడు పదో తరగతి విద్యార్థుల చదువు విషయంపై తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ కల్పించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. మొత్తంగా పదో తరగతిలో బాపట్ల మున్సిపల్‌ హైస్కూల్‌ ఖ్యాతి నిలబడే విధంగా ఉపాధ్యాయుల కృషి జరుగుతోంది.
పూర్తి స్థాయిలో ప్రిపేర్‌ అవుతున్నాం
డి షైనీ, మున్సిపల్‌ హైస్కూల్‌, పదో తరగతి విద్యార్థిని
బాపట్ల మున్సి పల్‌ హైస్కూల్లో కార్పొరేట్‌ స్థాయికి మించి విద్యా బోధన జరుగు తోంది. పదో తరగతిలో ఎవరికి వారు ఒకరికి మించి ఒకరు మంచి ర్యాంకులు సాధించాలనే కసితో చదువుతున్నాం. సబ్జెక్టుల పరంగా డౌట్లు ఉంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటున్నాం. మా మాస్టార్లు కూడా ఈ ఏడు టెన్త్‌ పరీక్షల్లో మా హైస్కూలు మంచిపేరు తెచ్చుకోవాలని విద్యాబోధన చేస్తూ విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్‌ చేస్తున్నారు.
ఉదయాన్నే సబ్జెక్టుల వారిగా ప్రిపేర్‌ అవుతున్నా..
డి హారిక, పదో తరగతి విద్యార్థిని, మున్సిపల్‌ హైస్కూల్‌
ఉదయాన్నే సబ్జెక్టుల వారిగా ప్రిపేర్‌ అవుతున్నాం. సెలవు దినాల్లో సైతం డౌట్స్‌ తెలుసుకోవడానికి స్కూల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక క్లాసులకు హాజరవుతున్నాం. స్టడీఅవర్లు (విజయస్ఫూర్తి) పఠనంతో పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది.